వాళ్లంతా బ్లాక్ ఎమ్మెల్యేలే: భూమన
వాళ్లంతా బ్లాక్ ఎమ్మెల్యేలే: భూమన
Published Sat, Dec 24 2016 12:45 PM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
బ్లాక్ మనీతో టీడీపీ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలంతా బ్లాక్ ఎమ్మెల్యేలనని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ రాజ్యాంగాన్ని లోకేష్ ఏమైనా రచించారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రజలంతా తనవైపే ఉన్నారని చంద్రబాబు అనుకుంటున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి టీడీపీలో చేర్చుకుంటున్నారని చెప్పారు. తమ పార్టీకి చెందిన ఉప్పులేటి కల్పనను కూడా అలాగే చేర్చుకున్నారన్నారు.
చంద్రబాబు పాలన అవినీతి, అరాచకాల మయమని, టీఆర్ఎస్ వాళ్ల పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కోర్టుకెళ్లిన టీడీపీ.. ఏపీలో విలువలు లేకుండా ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చస్తోందని భూమన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రజలు మెచ్చుకోరని, బెదిరింపులు, అణచివేత, కొనుగోళ్లు తప్ప మరేమీ లేవని అన్నారు. దొంగ బలం ద్వారా ఓట్లు వేస్తారనుకుంటే అది మీ భ్రమ మాత్రమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటేయమనే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. ఈసారి తమకు మొత్తం 175 సీట్లు వస్తాయని చెప్పుకొంటున్న బాబుకు.. 17 సీట్లకంటే ఎక్కువ రానే రావని జోస్యం చెప్పారు.
Advertisement
Advertisement