పట్టభద్రులు బద్ధకించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. సగం మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. అయితే, గతంలో కంటే కాస్త మెరుగైన పోలింగ్ శాతం నమోదైంది. ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మొత్తం గ్రేటర్ పరిధిలో 38 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గతంలో కంటే 11 శాతం అధికం. ఇక పోలింగ్ అన్నిచోట్లా ప్రశాంతంగా ముగిసింది. 25న కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రశాంతంగా జరిగింది. గతంలో మాదిరిగానే ఈ ఎన్నికల పోలింగ్‌పై ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. ముఖ్యంగా యువత ఆసక్తి కనబరచలేదు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. నెమ్మదిగా సాగింది. పోలింగ్ సమయం ముగిసే సాయంత్రం 4 గంటల వరకు అదే పరిస్థితి. తొలి రెండు గంటల్లో సగటున 7 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం 38 శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల కంటే ఇది 11 శాతం అదనం. గడచిన ఆరేళ్లలో ఎన్నికలపై పలు అవగాహన కార్యక్రమాలు.. ఎన్నికల సంఘం విస్తృతప్రచారం నిర్వహించినప్పటికీ.. నగర ఓటర్లలో ఆశించినస్పందన కనిపించలేదు.
శనివారం ఉగాది కావడం..ఆదివారం సెలవు కారణంగా సమీప జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు నగరానికి తిరిగి రాకపోవడం కూడా పోలింగ్‌పై కొంత మేర ప్రభావం చూపింది. జీహెచ్‌ఎంసీలోని కోర్ ఏరియా కంటే శివారు ప్రాంతాల్లో పోలింగ్ కొంత మెరుగ్గా ఉంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల కోసం హోరాహోరీ ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ మేరకు పోలింగ్ జరగలేదు. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మద్దతుదారులు ఆయా పోలింగ్ కేంద్రాల సమీపంలో కనిపించారు.
ఆ రెండు పార్టీల మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు పోలింగ్‌సరళిని అంచనా వేసిన వారు అభిప్రాయపడుతున్నారు. నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల్లోని 435 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.
25న ఫలితం...
మూడు జిల్లాల నుంచి బ్యాలెట్‌బాక్సులు ఓట్ల లెక్కింపు కేంద్రమైన నగరంలోని చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్‌కు అర్థరాత్రి వరకు చేరుకోగలవని నవీన్‌మిట్టల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు 25వ తేదీ బుధవారం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పత్రాలు అయినందున ఆలస్యం జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక రోజులోనే లెక్కింపు పూర్తియ్యేందుకు 28 టేబుళ్లు చేర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే నువ్వానేనా అన్నట్లుగా పోటీ జరిగిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ దంపతులు ఉప్పర్‌పల్లిలోని పోలింగ్‌కేంద్రం(నెం.124)లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీలో మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సినీ రయిత పరుచూరి గోపాలకృష్ణలు ఓటు వేశారు.
పోలింగ్ తీరు(శాతం) ఇలా...
జిల్లా ఉ.10 గం. మ.12గం. మ.2గం. సా.4గం.
హైదరాబాద్ 6 15 25 27
రంగారెడ్డి 7 8 27 37
మహబూబ్‌నగర్ 8 22 42 53
మూడు జిల్లాల్లో వెరసి (నియోజకవర్గంలో) అంతిమంగా సగటున 38 శాతం పోలింగ్ నమోదైంది.
ఎమ్మెల్సీ పోలింగ్ @ 38%
Published Mon, Mar 23 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM
Advertisement
Advertisement