
శనివారం ఉదయం హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతం. చాలా నిర్మలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. జనమంతా చార్మినార్ వైపు ఆసక్తిగా చూశారు. అయితే చార్మినార్ వైపు కాదు. అక్కడికొచ్చిన ‘మోదీ’ని చూసేందుకు. అదేంటి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే కనీసం ఏ హంగూ ఆర్భాటం లేదేంటి అనుకుంటున్నారా..? కనీసం ముందు రోజు చిన్న వార్త కూడా లేదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటంటే.. అక్కడికి వచ్చింది ప్రధాని మోదీ కాదు.. అచ్చు మోదీని పోలిన 59 ఏళ్ల సదానంద్ నాయక్.
కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్క గ్రామానికి చెందిన సదానంద్ జూనియర్ మోదీగా బాగా ఫేమస్. ఉడిపి జిల్లాలోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో వంట మనిషిగా పనిచేస్తూ గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందాడు. అనుకోకుండా గడ్డం పెంచడంతో తోటి ఉద్యోగులు, మిత్రులు మోదీలాగా ఉన్నావని చెప్పడంతో.. వేషధారణ కూడా అలాగే చేసుకోవడం ప్రారంభించినట్లు చెప్పాడు. పేదరికం కారణంగా 5వ తరగతి వరకే చదువుకుని 12 ఏళ్ల వయసులో ఓ హోటల్‌లో పనికి కుదిరానని పేర్కొన్నాడు. నరేంద్ర మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించినట్లు చెప్పాడు.
–చార్మినార్