సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులో కదలిక
- సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య 200 కి.మీ. వేగంతో రైళ్లు
- గత డిసెంబర్‌లో సర్వే చేసిన రష్యా ఇంజనీర్లు
- తాజాగా బ్లూప్రింట్ సిద్ధం చేసిన రైల్వే
- ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మార్గం సుగమం
సాక్షి, హైదరాబాద్: అదిగో ఇదిగో అంటూ ఊరించిన సికింద్రాబాద్–నాగ్‌పూర్ సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ తాజాగా బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. దీన్ని రష్యా సహకారంతో నిర్మించాల్సి ఉంది. గతేడాది డిసెంబర్‌లో 12 మంది సభ్యుల రష్యా రైల్వే బృందం ఈ మార్గాన్ని పరిశీలించి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై రైల్వేకు నివేదిక సమర్పించింది. రెండేళ్ల కింద ఈ ప్రాజెక్టును రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించినా ఆ తర్వాత ఊసే లేదు. తాజాగా అహ్మదాబాద్–ముంబై హైస్పీడు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టులో కూడా కదలిక రావటం విశేషం.
మూడు గంటల్లో గమ్యం..
దేశంలో రైల్వే వ్యవస్థ విస్తరిస్తున్నా.. రైళ్ల సగటు వేగం మాత్రం పెరగట్లేదు. దీంతో కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో వేగంగా రైళ్లను తిప్పాలని కేంద్రం నిర్ణయించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఢిల్లీ–ముంబై, ముంబై–చెన్నై, ఢిల్లీ–కోల్‌కతా, ఢిల్లీ–నాగ్‌పూర్, ముంబై–నాగ్‌పూర్ మధ్య గంటకు 250–300 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లతో హైస్పీడ్ కారిడార్లు, ఢిల్లీ–చండీగఢ్, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ– కాన్పూర్, ముంబై–గోవా, నాగ్‌పూర్– బిలాస్‌పూర్, చెన్నై– హైదరాబాద్, సికింద్రాబాద్– నాగ్‌పూర్ మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలని నిర్ణయిం చింది. ఈనేపథ్యంలో రష్యా భాగస్వామ్యంతో సికింద్రాబాద్–నాగ్‌పూర్ మార్గాన్ని చేపట్టేందుకు సర్వే చేయించింది.
ఈ మార్గం అనుకూలమేనని రష్యా బృందం తేల్చింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుగా తాజాగా రైల్వే శాఖ బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు సాధారణ రైళ్లకు దాదాపు 10 గంటల సమయం పడుతోంది. గంటకు 200 కి.మీ. వేగంతో సెమీ హైస్పీడ్ రైళ్ల దూసుకుపోతాయి కాబట్టి ఈ కారిడార్‌ను సెమీ హైస్పీడ్‌గా మారిస్తే 3 గంటల్లోనే గమ్యం చేరుకుంటారు.
రష్యా ఇంజనీర్లు చేసిన కొన్ని సిఫారసులు..
► ఈ మార్గంలో మొత్తం 1,770 చిన్న వంతెనలు, కల్వర్టులున్నాయి. 18 భారీ వంతెనలున్నాయి. వీటిని పటిష్టం చేయాలి.
► చాలాచోట్ల ప్రమాదకర మలుపులు న్నాయి. వాటిని తొలగిస్తేనే రైలు వేగం సాధ్యం.
► మార్గం మొత్తంలో గేటు కాపలా ఏర్పాటు చేయాలి. రైలు వేగంగా వెళ్తు న్నప్పుడు ప్రజలు, జంతువులు పట్టాలు దాటితే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
► సిగ్నలింగ్ వ్యవస్థలకు వాడుతున్న రేడియో ఫ్రీక్వెన్సీ విధానాన్ని మార్చి ఆధునిక పద్ధతి వాడాలి.
► జనావాసాలున్న చోట నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేయాలి .