అన్ని వర్గాలకు ఆమోదయోగ్యం
దేశాభివృద్ధికి బాటలు పరిచేలా ఉంది
ప్రభు బడ్జెట్‌పై ప్రధాని ప్రశంస
న్యూఢిల్లీ: టికెట్ ధరలు పెంచకుండా వీలైనంత తొందరగా, భద్రంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా, సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ రూపొందించారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీంతోపాటు దేశ అతిపెద్ద రవాణా వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి, పునరుజ్జీవింపచేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. ధరలు పెంచకుండా రూపొందించిన ఈ బడ్జెట్‌తో మౌలికవసతులు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని అన్నారు. దీని ద్వారా దేశ ప్రగతికి బాటలు పడతాయన్నారు. అభివృద్ధిని కాంక్షించి రూపొందించిన బడ్జెట్ ద్వారా రైల్వే వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ, పునర్నిర్మాణం జరుగుతుందని.. ఆదాయ మార్గాలు పెరగటం ద్వారా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ ప్రశంసించారు.
‘విజన్ 2020’తో లక్ష్యంతో రూపొందించిన 2016-17 రైల్వే బడ్జెట్ ద్వారా ప్రయాణంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి వేగం, సమయపాలన, భద్రమైన ప్రయాణం అందించేందుకు వీలవుతుందన్నారు. ప్రయాణికుల సౌకర్యం, రైళ్ల రాకపోకల్లో వేగం, భద్రత అనేవే బడ్జెట్‌లో ప్రధానమైనవన్న మోదీ.. గత ప్రభుత్వాలతో పోలిస్తే.. ప్రస్తుతం రైల్వే బడ్జెట్‌లో రెండున్నర రెట్ల పెట్టుబడులు పెరిగాయని గుర్తుచేశారు. దీని ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. తమ ప్రభుత్వం దీర్ఘకాల అభివృద్ధితో చేపట్టిన కార్యక్రమాలను ఈ బడ్జెట్ కళ్లకు కట్టినట్లు చూపెడుతోందని ప్రశంసించారు.
⇒సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని, సామాన్యుడికి న్యాయం జరిగేలా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ రూపొందించారు. టికెట్ ధరలు పెంచకుండానే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రశంసించదగినది. - అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు
⇒బడ్జెట్ అంటే ప్రజలో ఏదో ఆశిస్తారు.. అలా ఆశలు పెట్టుకున్న ప్రజలకు మోసం చేసేలా రైల్వే బడ్జెట్ ఉంది. బడ్జెట్ మొత్తంలో భద్రత అనే అంశంపై ఎక్కడా మాట్లాడకుండా రైలును పూర్తిగా పట్టాల నుంచి తప్పించారు. నేను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలకు రూ.60 వేల కోట్లు అదనపు నిధులుండేవి.
-లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత
⇒రైల్వే బడ్జెట్ అసంతృప్తికరంగా ఉంది. స్వచ్ఛత, భద్రత, సమయపాలన వంటి అంశాలపై ప్రస్తావించలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా టికెట్ ధరలు తగ్గించడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
-నితీశ్ కుమార్, బిహార్ సీఎం, మాజీ రైల్వే మంత్రి