ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం
ఎంపీ కవిత
కవాడిగూడ: హైదరాబాద్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని ఎంపీ కవిత అన్నారు. గ్రేటర్ పగ్గాలనూ టీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. టీఆర్‌ఎస్ కవాడిగూడ డివిజన్ అభ్యర్థి లాస్య నందిత తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి ఆమె శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా కేసీఆర్ పేదల సంక్షేమం కోసం వినూత్న పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
వృద్ధులు, వికలాంగ, వితంతు పెన్షన్లు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. పేద యువతుల వివాహం కోసం ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.51 వేలు మంజూరు చేయడం దేశంలో మరెక్కడా లేదన్నారు. గూడు లేని పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. స్థానిక మహిళల నుంచి కవితకు అపూర్వ స్వాగతం లభించింది. ఆమెకు హారతులిచ్చి పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.యాదగిరి, గౌరీశంకర్, దినేష్, కల్వ గోపి, చంద్రశేఖర్‌గౌడ్, శ్యామ్‌యాదవ్, రాజుయాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.