దాసరి, చిరంజీవి, బొత్సలతో ముద్రగడ భేటీ
– ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చ
– చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలి
– ఉద్యమానికి మద్దతు ప్రకటించిన నేతలు
సాక్షి, హైదరాబాద్: కాపులను మరోసారి రోడ్డు ఎక్కించే అవసరం లేకుండానే ఇచ్చిన హామీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తిచేశారు. ఆయన శనివారం పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణలను కలిసి ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాపులకు ఎన్నో సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపుల ఓట్లకు వలవేసి ఎన్నికల్లో గెలిచారని, ఆ హామీలను అమలుపరచకపోవడం వల్లనే తునిలో తాను ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. రాజస్థాన్, హర్యానాల్లో తమకంటే ముందుగా ఉద్యమాలు చేపట్టిన వారికి తీపి కబురు అందిందని, ఆ తీపి కబురు సీఎం అందించాలని విజ్ఞప్తి చేశారు.
నేతల మద్దతు...
ముద్రగడ చేపట్టే ఉద్యమానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని దాసరి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం చాలా కులాలను బీసీలుగా గుర్తించిందని, అదే విధమైన విధానాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని తెలిపారు. సీఎం మాట మీద ముద్రగడ దీక్ష విరమించారని, ఇచ్చిన మాటను నెరవేర్చుతారని భావిస్తున్నానన్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి తన మద్దతు, సహకారం ఉంటుందని చిరంజీవి చెప్పారు. సీఎం హామీ ఆగస్టులోపు అమలులోకి రాకపోతే ఆందోళన చేపట్టడానికి ముద్రగడ కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగానే ఉన్నారని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడని బొత్స విమర్శించారు.