
అగ్గిపెట్టె లేదన్నందుకు...
►యువకుడి దారుణ హత్య
►పాత కక్షలే కారణం
బంజారాహిల్స్: అగ్గిపెట్టె అడిగితే లేదన్నందుకు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఓ యువకుడిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మక్సూద్‌అలీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీలో సమీపంలోని బోరబండకు చెందిన ఆమేర్‌ఖాన్(22), అతని స్నేహితులు సొహైల్, షారూఖ్ ఆదివారం రాత్రి మద్యం సేవిస్తున్నారు. వారికి సమీపంలోనే నరేందర్ అనే యువకుడితో పాటు మరో నలుగురు స్నేహితులు మద్యం సేవిస్తున్నారు. ఈ సందర్భంగా నరేందర్ సిగరెట్ వెలిగించుకునేందుకు అమేర్‌ను అగ్గిపెట్టె అడిగాడు.
‘నేను సిగరెట్ తాగనని తెలుసుకదా అగ్గిపెట్టె ఎలా ఉంటుందని’ అమేర్ చెప్పాడు. ఆ తర్వాత ఆమేర్, అతని స్నేహితులు బైక్‌పై వెళ్లేందుకు సిద్ధపడుతుండగా నరేందర్ అమేర్‌ను పిలవడంతో అతను అక్కడికి వెళ్లాడు. అయితే కొద్ది సేపటికి అమేర్ కేకలు విన్న సొహైల్ అక్కడికి వెళ్లి చూడగా నరేందర్ కత్తితో ఆమేర్‌ను పొడుస్తున్నాడు. క్షణాల్లోనే ఆమేర్ కుప్పకూలిపోయాడు. నరేందర్ పారిపోతూ సొహైల్‌పై కూడా రాళ్లతో దాడికి యత్నించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతుడి శరీరంపై 15 కత్తిపోట్లు గుర్తించారు. నరేందర్ కోసం గాలింపు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేందర్‌తో పాటు ఆయన స్నేహితులకోసం గాలింపు చేపట్టారు.