
అన్నింటా..వీరే
ముత్తూట్...మినీ... ‘మహా’ దొంగల గుర్తింపు
రామచంద్రపురం ఠాణా పరిధిలో దోపిడీ, కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో దోపిడీ యత్నం వీరి పనే
దేశవ్యాప్తంగా 22 ముత్తూట్ దోపిడీ కేసుల్లో వీరిదే మెజారిటీ
మహారాష్ట్ర కేంద్రంగా హవాలా డబ్బు చోరీ చేసినట్లు అనుమానం
పోలీసుల అదుపులో బీరంగూడ దోపిడీ కేసు నిందితులు
సిటీబ్యూరో: రామచంద్రపురం ఠాణా పరిధిలోని బీరంగూడ ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో జరిగిన భారీ దోపిడీ...అదే ఏడాది మే 29న కేపీహెచ్‌బీకాలనీలోని హైదర్‌నగర్ ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో దోపిడీకి విఫలయత్నం, గతేడాది డిసెంబర్ 28న అదే బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీ...సంచలనాలకు కేరాఫ్‌గా మారిన ఈ మూడు ‘ముత్తూట్’ కేసుల్లోనూ దోపిడీ దొంగల శైలి ఒకేలా ఉండటం, వారు స్కార్పియో కారులోనే రావడం ఒకటే ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. తొలి, రెండు కేసుల్లో నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేసినా ఒక్కరినీ కూడా పట్టుకోకపోవడంతో తాజా ముత్తూట్ కేసు విచారణతో ఆ రెండు చోరీలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతేడాది డిసెంబర్ 28న ముత్తూట్‌లో దోపిడీ చేసిన ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సీబీఐ అధికారి వేషధారణలో ఉన్న వ్యక్తి లక్ష్మణ్ నారాయణ్‌తో పాటు స్కార్పియో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు గతంలో జరిగిన దోపిడీలపై కూపీ లాగుతున్నారు. దాదాపు పది మంది సభ్యులు గల ఈ ముఠా దేశవ్యాప్తంగా జరిగిన 22 ముత్తూట్ దోపిడీ కేసుల్లో మెజారిటీ దోపిడీలు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది మేలో గుల్బర్గాలోని ముత్తూట్ కార్యాలయంలోనూ వారు దోపిడీ చేసినట్లు గుర్తించారు. దక్షిణ భారతదేశ గ్యాంగ్‌గా పేరొందిన వీరు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో బంగారం చోరీలకు పాల్పడిందని, ఈ కేసు విచారణ పూర్తయితే సంచలనాత్మకమైన కేసులు ఎన్నో వెలుగులోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ముఠా సభ్యులందరిపై నిఘా ఉంచామని, సాధ్యమైనంత త్వరలో వారిని పట్టుకొని బంగారం రికవరీ చేస్తామన్నారు.
సొత్తు పంచుకొని ఎవరి ప్రాంతాలకు వాళ్లు....
తాము దోపిడీ చేయాలనుకుంటున్న కార్యాలయంలో భద్రతపై ముందే రెక్కీ నిర్వహిస్తారు. అంతా ఓకే అనుకున్నాక తమ పని పూర్తి చేసుకుని స్కార్పియో కారులో చక్కేస్తారు. దోపిడీ చేసే ముందు నేరగాళ్లు వాడిన సెల్‌ఫోన్ నంబర్లన్నీ ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అవుతాయి. నేరస్థలిలో కనీస ఆధారాలు లేకుండా జాగ్రత్త పడతారు. చోరీ సొత్తును సమానంగా పంచుకొని ఎవరి ప్రాంతానికి వారు వెళ్లిపోతారు. ఒకరికి ఒకరు దాదాపు పక్షం రోజుల పాటు కాంటాక్ట్‌లో ఉండరు. దీంతో పోలీసులకు దొరకడం ఇబ్బందిగా మారింది. ఇంకో విషయమేంటంటే ఇద్దరు ముగ్గురు సభ్యులు తమ ప్రాంతంలో దోపిడీలు చేసినా చోరీ సొత్తును తమ బృందంలోని మిగతా ఏడుగురు సభ్యులకు కూడా సమానంగా పంచుతారు.
హవాలా డబ్బులు కూడా...
బంగారు ఆభరణాలతో పాటు వీరు ఎక్కువగా హవాలా దందా డబ్బులు కూడా చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా ఈ దందా నడిపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. హవాలా డబ్బులు బ్లాక్‌మనీ కావడంతో బాధితులు ఎక్కడా ఫిర్యాదు కాకపోవడంతో కేసులు నమోదుకాన్నట్టుగా సమాచారం. ముంబైలోని ఓ జైల్లోనే కలిసిన వీరంతా పక్కాగా బంగారు ఆభరణాల దోపిడీని అమలు చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.