
ఆరు సేవలతో ‘మై జీహెచ్‌ఎంసీ’
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పౌరసేవలందించేందుకు ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది జీహెచ్‌ఎంసీ. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా జనన సర్టిఫికెట్లు, మరణ సర్టిఫికెట్లు, ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సు, ఎల్‌ఆర్‌ఎస్, వివిధ సమస్యల ఫిర్యాదులు మొదలైన ఆరు రకాల సేవలు అందించనున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదైన వారి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రజలే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ సంతకంతో కూడిన ఇవి ఎక్కడైనా చెల్లుబాటవుతాయి.
ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల వివరాలతోపాటు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. వీటితోపాటు రహదారులు, మ్యాన్‌హోల్స్, పాట్‌హోల్స్, డంపర్ బిన్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, వీధి దీపాలు.. ఇలా ఏ సమస్య కనిపించినా మొబైల్‌లో ఫొటో తీసి, అప్‌లోడ్ చేయాలి. జీపీఎస్ సాంకేతికతతో సమస్య ఎక్కడ ఉందో తెలియడంతోపాటు ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్ తదితర వివరాలు సంబంధిత అధికారులకు చేరతాయి. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. పరిష్కారమయ్యాక ఫిర్యాదుదారులకు మెసేజ్ అందుతుంది. ఒకవేళ పరిష్కారంపై సంతృప్తి చెందని పక్షంలో ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. ఏ పనిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తారు. లేనిపక్షంలో పైఅధికారికి చేరుతుంది. అలా కమిషనర్, మేయర్ వరకు చేరుతుంది. దీర్ఘకాలం పరిష్కారం కానివాటిని తనకు కూడా పంపించాల్సిందిగా శుక్రవారం ఈ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
చెల్లింపులు కూడా..: ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్సులకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ నంబర్లు, చివరిసారిగా ఎంత చెల్లించింది.. ఎంత బకాయి ఉంది వంటి వివరాలను తెలుసుకోవడంతోపాటు బకాయిలు, ఫీజుల్ని సైతం యాప్ నుంచే చెల్లించవచ్చు. చెల్లించిన వెంటనే ఎస్‌ఎంఎస్ వస్తుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లకే పరిమితమైన ఈ యాప్‌ను నెల రోజుల్లో ఐఓఎస్ ఫోన్లకు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు.