హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను మెచ్చుకుంటే మంచివారు... లేకుంటే చెడ్డవారా ? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి రుజువు చేస్తా... లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు.
తాను టీడీపీకి రాజీనామా చేసి... ఒంటరిగా గెలిచానని ఈ సందర్భంగా నాగం జనార్దన్రెడ్డి గుర్తు చేశారు. ఎఫ్ఆర్బీఎం 3 నుంచి 3.5 శాతానికి పెంచిన ఎందుకు రుణామాఫీ చేయడం లేదని కేసీఆర్ను నాగం ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంకా ఏపీ నేతనే నడిపిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.
కృష్ణానదీ జలాలపై పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు పూర్తి హక్కు ఉందని నాగం స్పష్టం చేశారు. ఒకప్పుడు దత్తత తీసుకున్న మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం జరగకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్కు జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ చెడ్డవాడయ్యారా అని నాగం సందేహాం వ్యక్తం చేశారు.