
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేస్తున్న అవినీతికి ఇన్‌కం డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రెస్‌నోటే అందుకు సాక్ష్యమని ఆరోపించారు. కాంట్రాక్టులలో విపరీత దోపిడీ జరుగుతోందని, ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశాడని విమర్శించారు. ఆయన మాటల్లోనే.. చాలా రోజుల నుండి అవినీతిపై పోరాటం చేస్తున్నాను. రూ. 2400 కోట్లతో ఒకే టెండర్ ద్వారా ఒకే సంస్థకు బీటీ రోడ్ల కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కమీషన్లు తీసుకునేందుకే ఈ టెండర్లను రూపొందిస్తున్నారు. ఆనాడు ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్ నేడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సంపదను పంచిపెడుతున్నాడు. ఒక్క కాంట్రాక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే వందల కోట్ల అవినీతి బయటపడుతుంది. తెలంగాణవ్యాప్తంగా ఎంత అవినీతి జరుగుతోందో ప్రజలు అర్థం చేసుకోవాలి. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం. వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరంతో ఒక్కచుక్క నీరు రావట్లేదు. సెక్రటేరియట్, అసెంబ్లీ పేరిట కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజలను బిచ్చగాళ్లను చేసేలా పాలిస్తున్నారు. అవినీతిపై అప్పటి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాస్తే పట్టించుకోలేదు. ఖాసీం రజ్వీ ప్రజలను హింసిస్తే, కేసీఆర్ ఆర్ధికంగా రాష్ట్రాన్ని పీల్చేస్తున్నాడు. ఇప్పటివరకు దోచుకున్న డబ్బంతా తిరిగి చెల్లించాలి. లేకుంటే ప్రజలే గద్దె దించుతారు. కేసీఆర్ అనుభవరాహిత్యం, అహంభావ వైఖరి వల్లే నేడు ఆర్టీసీ కార్మికులు సమ్మెచేసే పరిస్థితి వచ్చింది. వారి ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment