మహబూబ్నగర్ : తెలంగాణలో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు మద్యంపై రోజూ మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రంలో ఏర్పడిన కరువుపై మాత్రం ఎవరూ పెదవి విప్పడంల లేదని ఆయన ఎద్దేవా చేశారు.
గురువారం మహబూబ్నగర్ జిల్లాలో బాలానగర్ మండలం సింగమ్మగూడెం తండాలో ఏర్పడిన కరువు పరిస్థితులను మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలసి పర్యటించారు. కరవు సహాయం కోసం ప్రభుత్వంతో పోరాడదామని ఆయన రైతులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పంటపొలాలను ఆయన పరిశీలించారు.
రైతులు సంయమనం కోల్పోవద్దని... అండగా ఉంటానని...ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. మహబూబ్నగర్ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని నాగం జనార్దన్రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.