సుజనా చౌదరికి లోకేష్ చెక్
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
- రాజ్యసభ సీటుపై కన్నేసిన లోకేష్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ప్రయత్నాలతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పదవికి గండమొచ్చింది. తన రాజకీయ ప్రాభల్యం పెంచుకునే ఎత్తుగడలో భాగంగా లోకేష్ ఈసారి రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ మేరకు లోకేష్ ఇప్పటి నుంచే పార్టీలో తన వర్గం ద్వారా బలమైన సంకేతాలు పంపుతున్నారు. ఎంత చేసినా ముఖ్య నాయకుడిగా లోకేష్ ఎదగలేకపోతున్నారని ఇటీవలి కాలంలో పార్టీలో విపరీతమైన చర్చ మొదలైన నేపథ్యంలో ఆయన ఈసారి రాజ్యసభకు ఎంపిక కావడంపై కన్నేశారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. వచ్చే జూన్ మూడో వారం నాటికి వారిలో నలుగురి పదవీ కాలం పూర్తి కానుంది. కాంగ్రెస్ కు చెందిన జైరాం రమేష్, జేడీ శీలంలతో పాటు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి (వైఎస్ చౌదరి), బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ల పదవీ కాలం పూర్తవుతోంది. ఖాళీ కాబోతున్న ఈ నాలుగు రాజ్యసభ స్థానాల కోసం ఫిబ్రవరి ఆఖరున కేంద్ర ఎన్నికల సంఘం ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించనుంది.
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా రాజ్యసభకు వెళ్లాలని లోకేష్ భావిస్తున్నారు. దాంతో ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి కి చిక్కొచ్చిపడింది. లోకేష్ రాజ్యసభకు వెళితే సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పించే అవకాశాలు లేవు. పైగా ఇటీవలి కాలంలో సుజనా చౌదరి వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
నాయకుడిగా ఎదగడమెలా
పార్టీలో కీలక నేతగా ఉన్నప్పటికీ ప్రజల్లో లోకేష్ కు ఏమాత్రం పాపులారిటీ రాకపోవడం, ఒక లీడర్ గా ఎదగలేకపోవడంపై టీడీపీలో పెద్ద చర్చ మొదలైన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కు మీడియాలో పాపులారిటీ బాగా పెరిగిపోతోందని లోకేష్ సమక్షంలో సన్నిహితుల మధ్య చర్చ జరిగింది. లోకేష్ కు ప్రజల్లో అంతగా పాపులారిటీ రాకపోవడానికి అధికార పదవి లేకపోవడం కూడా ఒక కారణంగా బేరీజు వేసుకున్ననేపథ్యంలో ఈసారి రాజ్యసభ స్థానంపై కన్నేశారు. రాజ్యసభకు ఎంపిక కావడం ద్వారా జాతీయ స్థాయిలో నాయకులతో పరిచయాలు పెరుగుతాయని, ఆయా నాయకులతో సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చని అంచనాకు వచ్చిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో రాజ్యసభకు వెళ్లాలన్న తన అభిమతాన్ని సన్నిహితుల ముందు వ్యక్తం చేశారు.జాతీయ స్థాయిలో మీడియా మేనేజ్ మెంట్ కోసం ఇప్పటికీ ఢిల్లీలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న లోకేష్ రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలోని నేతలతో పరిచయాలు పెంచుకోవచ్చన్న ఆలోచనకు వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్నట్టయితే రాష్ట్రంలోనూ తన పాపులారిటీ పెరుగుతుందన్న భావనకొచ్చారు.
సుజనా పదవికి ఎసరు
త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాజ్యసభకు వెళ్లాలన్న లోకేష్ ప్రయత్నాలతో సుజనా చౌదరి పదవికి ఎసరొస్తోంది. లోకేష్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించిన పక్షంలో అదే సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి రాజ్యసభకు మరోసారి అవకాశం కల్పించే అవకాశాలు లేవు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో టీడీపీ మూడింటిని, మరో స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలదు. టీడీపీకి దక్కబోయే మూడు స్థానాల్లో ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వరు. ఈ మూడింటిలోనూ ఒక స్థానం మిత్రపక్షమైన బీజేపీకి చెందిన నిర్మలా సీతారామన్ ఉన్నారు. మిత్రపక్షంగా బీజేపీ కోరితే నిర్మలా సీతారామన్ కు మరోసారి అవకాశం కల్పించకతప్పదు. 2014లో రాజ్యసభకు జరిగిన ఉపఎన్నికల్లో నిర్మలా సీతారామన్ ఎన్నిక కాగా, రెండేళ్లు మాత్రమే పదవిలో కొనసాగిన ఆమెకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే టీడీపీకి దక్కే మూడో స్థానంపై ఎంతో మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఇప్పటికే దాదాపు 15 మంది నేతలకు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సుజనా చౌదరిని తప్పిస్తే తప్ప అవేవీ సాధ్యం కాదు.
ఆగ్రహంతో బాబు
ఇకపోతే సుజనా చౌదరి వ్యవహార శైలి పట్ల చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుజనా చౌదరి ఎక్కువగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అత్యంత సన్నిహితుడిగా మారారని, రాష్ట్ర పార్టీ నేతలు చెప్పిన పనులేవీ సుజనా చౌదరి పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై కొందరు ఎంపీలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా, వచ్చే సారి ఎలాగూ రాజ్యసభ రెన్యూ చేయడం లేదు కదా... అని చంద్రబాబు సమాధానం ఇచ్చారని అంటున్నారు. అయితే లోకేష్ కు దారి సుగమం చేయడానికి ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారని సుజనా వర్గీయులు మండిపడుతున్నారు.