రాజ్యసభ స్ఫూర్తిని మంటగలిపిన ‘పెద్దలు’
న్యూఢిల్లీ: రాజ్యసభ లేదా పెద్దల సభ ఆవశ్యకతను, రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని పెద్దలు అంటే, రాజ్యసభ సభ్యులే మంటగలుపుతున్నారు. చాలా మంది పెద్దలు సొంత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం లేదు. పార్టీ అధిష్టానం చెప్పిన పొరుగు రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యులు తమ ఢిల్లీ పెద్దల చేతుల్లో రబ్బరు స్టాంపులుగా మారిపోయారు. ఈ విషయంలో నేటి పాలకపక్ష భారతీయ జనతా పార్టీకిగానీ, విపక్ష కాంగ్రెస్ పార్టీకిగానీ ఎలాంటి మినహాయింపులేదు. ఈ రెండు పార్టీలు చాలాకాలంగా రాష్ట్రాలకు సంబంధంలేని వారిని ఆ రాష్ట్రాల ప్రతినిధులుగా రాజ్యసభకు పంపిస్తున్నాయి. ఈ పార్టీలు శనివారం పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికలకు పాత పద్ధతిలోనే వ్యవహరించాయి.
ఇది అక్షరాల ప్రజలను మోసం చేయడం, దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయడం, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలపడం. భిన్న సంస్కతులుగల విశాల భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ అనేది ఎంతైనా అవసరం, దాన్ని ‘కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్’ అని కూడా వ్యవహరిస్తామని రాజ్యసభ వెబ్‌సైటే అధికారికంగా తెలియజేస్తోంది. రాజ్యసభ సమాఖ్య వ్యవస్థకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందంటే.....లోక్‌సభ ప్రధానంగా జాతీయ అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటే, రాజ్యసభ వివిధ రాష్ట్రాలకు చెందిన అంశాలను ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల ద్వారా చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలన్నది సమాఖ్య స్ఫూర్తి.
ఈ స్ఫూర్తి ఎంతవరకు అమలు జరుగుతుందన్నది మనందరికి తెల్సిందే. ఉదాహరణకు కేంద్ర గృహనిర్మాణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడిని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, పెరగడమే కాకుండా ఈ తెలుగు రాష్ట్రం నుంచే రాజకీయాల్లో ఎదిగిన వారు. ఆంధ్రప్రదేశ్ ఆరెస్సెస్‌లో పనిచేసి, ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు. రెండుసార్లు ఏపీ అసెంబ్లీకి ఎన్నికై శాసనసభా పక్ష నాయకుడిగా వ్యవహరించడమే కాకుండా ఏపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికైనా ఏనాడు ఏపీకి ప్రాతినిధ్యం వహించలేదు. మూడుసార్లు కూడా కర్ణాటక రాష్ట్ర ప్రతినిధిగానే ఎన్నికయ్యారు. అలా అని వెంకయ్య నాయుడు కర్ణాటక రాష్ట్రానికి నిజంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారా? అంటే, అదీ లేదు. 18 ఏళ్లు ఆయన రాజ్యసభకు కర్ణాటక నుంచే ప్రాతినిధ్యం వహించారంటే అక్కడి ప్రజలను, వారి సమస్యలను సొంతం చేసుకోవచ్చు. అలా చేయలేదే! 2009, జూన్ 9 నుంచి 2014, ఫిబ్రవరి 21వ తేదీల మధ్య 86 సార్లు రాజ్యసభ చర్చల్లో పాల్గొన్నారు. ఒక్కసారి కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంశాన్ని ప్రస్తావించలేదు.
పైగా ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసే అంశం, ఏపీలోని విశాఖపట్నంలో జరిగిన అగ్నిప్రమాదం, హైదరాబాద్‌లో సంభవించిన జంట పేలుళ్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 18 వేల మంది ఏపీ కార్మికుల దుస్థితి, ఏపీలోని పెనుకొండ వద్ద జరిగిన రైలు ప్రమాదం, లండన్‌లో ఏపీ ఎంబీఏ విద్యార్థి హత్య, ఏపీలో కురిసిన అకాల వర్షాలు తదితర అంశాలపై చర్చించారు.
మంచి తెలుగు స్పీకర్‌గా గుర్తింపు పొందిన వెంకయ్య నాయుడు కష్టపడి హిందీ భాష నేర్చుకున్నారు తప్ప ఏనాడు కన్నడ పట్టించుకోలేదు. 18 ఏళ్లపాటు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కర్ణాటకలోనూ ఆయన హిందీలోనే మాట్లాడి అక్కడి ప్రజల హదయాలను గాయపర్చారు. అందుకే ఈసారి అక్కడి ప్రజలు, పార్టీ కర్ణాటక నుంచి వెంకయ్య ప్రాతినిధ్యం వహించేందుకు అంగీకరించలేదు. అందుకనే పార్టీ అధిష్టానం ఈసారి ఆయనకు రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం ఇస్తోంది.
కర్ణాటక ప్రజలు ఏం పాపం చేసుకున్నారో, ఏమోగానీ వెంకయ్య స్థానంలో ఏపీ నుంచి కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించేందుకు మరొకరిని బీజేపీ అధిష్టానం పంపించింది. తమిళనాడులో పుట్టి ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈసారి వెంకయ్య స్థానంలో కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు, ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఇలా జరగడం లేదు. బీజేపీకి చెందిన 20 శాతం మంది రాజ్యసభ సభ్యులు సొంత రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఢిల్లీ-ముంబైకి చెందిన స్మృతి ఇరానీ గుజరాత్‌కు, ఢిల్లీకి చెందిన అరుణ్ జైట్లీ గుజరాత్‌కు, మహారాష్ట్రకు చెందిన సురేశ్ ప్రభు హర్యానాకు, కోల్‌కతా–ఢిల్లీకి చెందిన ఎంజే అక్బర్ జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మహారాష్ట్రకు చెందిన ప్రకాష్ జవడేకర్ మధ్యప్రదేశ్‌కు, ఢిల్లీకి చెందిన విజయ్ గోయల్ రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లే ఈ సంస్కృతి బీజేపీకి మాత్రమే పరిమితం కాలేదు.
కాంగ్రెస్ పార్టీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహిసినా కిద్వాయ్ చత్తీస్‌గఢ్‌కు, కాశ్మీర్‌కు చెందిన కరణ్ సింగ్ ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్–ముంబైకి చెందిన రాజ్ బబ్బర్ ఉత్తరాఖండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి 2005 నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లోలాగా మనమూ సమాఖ్య వ్యవస్థను కలిగి ఉన్నామని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటో ఈ వివరాలతో స్పష్టమవుతోంది. కనీసం రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన హక్కులు కూడా లేవు. ఒక రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు, మరో రాష్ట్రం నుంచి తక్కువ సీట్లు ఉండడం ఏ సమాఖ్య వ్యవస్థకు స్ఫూర్తియే న్యాయ నిర్ణేతలే చెప్పాలి.