రాజస్తాన్ నుంచి రాజ్యసభకు వెంకయ్య
కర్ణాటక నుంచి నిర్మల.. బీజేపీ జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును బీజేపీ ఈసారి రాజస్తాన్ నుంచి రాజ్యసభ బరిలో నిలిపింది. 1998 నుంచి మూడుసార్లు కర్ణాటక నుంచి పెద్దల సభలోకి అడుగుపెట్టిన వెంకయ్య స్థానంలో ఈసారి మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశమిచ్చింది. జూన్ 11న జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు 12 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం ప్రకటించింది.
ఈ నెల 31న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుండటంతో.. రెండో జాబితాను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఆదివారం విడుదల చేసి న జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను హరియాణా నుంచి, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి రీనామినేట్ చేసింది. గతంలో యూపీ నుంచి నామినేట్ అయిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఈసారి జార్ఖండ్ నుంచి, అనిల్ దవేను మధ్యప్రదేశ్ నుంచి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రూపాలను గుజరాత్ నుంచి, మరో ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ మాధుర్‌ను రాజస్తాన్ నుంచి బరిలోకి దింపింది.