ఫోన్ నంబర్లు మార్చుకోండి
- అనుచరులు, నేతలకు సూచించిన లోకేష్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తెలుగుదేశం పార్టీనేతల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణంలో ఏమౌతుందోనన్న ఆందోళనలో ఉన్న నేతలు ఇప్పటి వరకూ తాము ఉపయోగిస్తున్న ఫోన్లలో ఇతరులతో సంప్రదింపులు జరిపేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. అన్ని స్థాయిల నేతలకు ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఫోన్ నంబర్లు మార్చి తాత్కాలికంగా ఉపశమనం పొందాలని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ కూడా ఈ మేరకు పార్టీ నేతలకు ఇదే రకమైన సూచన చేశారు.
పార్టీలోని అన్ని స్థాయిల నేతల సాధ్య మైనంత వరకూ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను మార్చాల్సిందిగా ఆయన మౌఖికంగా సూచించారు. కొద్ది రోజుల పాటు కొత్త ఫోన్ నంబర్లు ఉపయోగించటం ద్వారా మనపై నిఘా పెట్టిన వారి దృష్టి మరల్చవచ్చని ఆయన చెప్పినట్లు సమాచారం. లోకేష్ ప్రస్తుతం ఏపీలోని పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్న నేపథ్యంలో లోకేష్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ముఖ్య నేతలు కీలకపాత్ర పోషించారని తెలంగాణ ఏసీబీ నిర్ధారించటంతో పాటు కొన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. పార్టీ ముఖ్య నేతలు ఉపయోగించే ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం సేకరించిన ఏసీబీ వారు ఎవరెవరితో ఏం మాట్లాడారో కూడా కోర్టుకు సమర్పించారు. తనకు ప్రధాన అనుచరులుగా, సహాయకులుగా ఉన్న వారి ఫోన్ నంబర్లను కూడా లోకేష్ ఇప్పటికే మార్పించారు. తాను నిత్యం ఉపయోగించే తన సహధ్యాయి ఒకరి ఫోన్ నంబర్‌ను లోకేష్ ఇప్పటికే మార్పించినట్లు టీడీపీ వర్గాల సమాచారం.
ఇప్పటికే తెలంగాణ ఏసీబీ లోకేష్ ఫ్రధాన అనుచరులుగా ఉన్న ప్రదీప్ చౌదరి తదితరులను పిలిపించి విచారించింది. ఇక ముందు కూడా పలువురిని పిలిపించి విచారించే అవకాశం ఉండటంతో పాటు వారి కదలికలపై నిఘా పెట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉపయోగించే ఫోన్ నంబర్లలో ఎవ్వరికీ అందుబాటులో ఉండవద్దని వీరికి ఎన్‌టీఆర్ భవన్ ద్వారా లోకేష్ సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
ఓటుకు నోటు కేసులో పాత్ర ఉన్న వారిని గుర్తిస్తున్న ఏసీబీ విచారణకు విడతల వారీగా పిలుస్తున్న నేపథ్యంలో తన కదలికలపై కూడా దర్యాప్తు సంస్థ నిఘా ఉంటుంది కాబట్టి ఇక నుంచి ఎక్కువ సమయం విజయవాడలోనే మకాం వేస్తానని లోకేష్ పార్టీ నేతలకు చెప్పారు.
వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు విజయవాడలో , రెండు నుంచి మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజల క్రితం వరకూ తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన కొండల్ రెడ్డి స్థానంలో పవన్ అనే వ్యక్తిని లోకేష్ డ్రైవర్‌గా నియమించుకున్నట్లు సమాచారం.
కొండల్‌రెడ్డిని ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. విచారణకు గైర్హాజరైనప్పటి నుంచి కొండల్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌లోని ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం కల్పించినట్లు ఎన్‌టీఆర్ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.