నగరశివారులోని మణికొండ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా కొండకళ్ల నరేందర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.
మణికొండ, న్యూస్‌లైన్: నగరశివారులోని మణికొండ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా కొండకళ్ల నరేందర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. శివార్లలోని 35 పంచాయతీలు గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసినా న్యాయపోరాటంతో ఒక్క మణికొండకు ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేసిన వ్యక్తినే గ్రామస్థులు 818 ఓట్ల రికార్డు మెజార్టీతో గె లిపించారు. పంచాయతీ పరిధిలో 6,409 ఓట్లు ఉండగా వాటిలో 3,844 ఓట్లు పోలయ్యాయి. వాటిలో బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఉపసర్పంచ్ కె. నరేందర్‌రెడ్డికి 1,811 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ యాలాల నరేశ్‌కు 993 ఓట్లు, టీడీపీ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బుద్దోలు జైహింద్‌రావుకు 982 ఓట్లు వచ్చాయి.
14 వార్డుల్లో అత్యధికంగా బీజేపీ, నరేందర్‌రెడ్డి ప్రచారం చేసినవారే గెలుపొందారు. దాంతో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్. నాగేశ్‌ను ఉపసర్పంచ్‌గా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికల ప్రక్రియ రాత్రి 8 గంటలకు ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వృద్ధులు, వికలాంగులు సైతం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గతంలో ఓటుహక్కుకు దరఖాస్తు చేసినా రాకపోవటంతో ఓటు వేసేందుకు వచ్చిన సినీనటుడు శివారెడ్డి వెనుదిరిగారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు లండన్ నుంచి వచ్చిన మాధవి అనే మహిళ.. స్థానికంగా ఉండటం లేదని ఓటును తొలగించారని చెప్పడంతో అధికారులతో వాదనకు దిగారు. మొదటగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్లుండి తరువాత తొలగింపు జాబితాలో ఓట్లు పోయాయని పలువురు ఎన్నికల అధికారులతో గొడవ పడ్డారు.
అందుబాటులో ఉండి సేవచేస్తా
గెలుపొందిన అనంతరం మణికొండ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. నగర శివారు గ్రామాలను పంచాయతీలుగానే ఉంచాలనే అభిప్రాయం గాఢంగా ఉందని తనకు వచ్చిన మెజార్టీ స్పష్టం చేస్తుందన్నారు.