మెట్రో రైలుపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ..
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం పూర్తిచేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర కేబినెట్ అదనపు కార్యదర్శి ఆనంద స్వరూప్, సంయుక్త కార్యదర్శి జాయిస్ గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, జీఏడీ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, రైల్వే జీఎం శ్రీవాత్సవ తదితరులతో మెట్రో రైలు పురోగతిని సమీక్షించారు.
మెట్రో రైలుకు అవసరమైన అన్ని అనుమతులు వెంటనే ఇచ్చేలా చూడాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. మెట్రోరైలు నిర్మాణ పురోగతిని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. మెట్రోరైలు ట్రయల్ రన్‌ను వచ్చేనెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.
నేడు ఢిల్లీలో..: మెట్రో రైలు పురోగతి, వివాదాలు, ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వద్ద శుక్రవారం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పాల్గొననున్నారు.