న్యూఢిల్లీ: రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్), రైల్వే రక్షక ప్రత్యేక దళం (ఆర్‌పీఎస్‌ఎఫ్) మినహా మిగిలిన నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో 11.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్టంగా రూ. 17,951 వరకు బోనస్ పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఉత్పాదకతను బట్టి ఇచ్చే ఈ బోనస్ కారణంగా రైల్వేపై రూ. 2,044.31 కోట్ల భారం పడుతుందని అంచనా. ఏటా దసరా పండుగకు ముందు ఉద్యోగులకు రైల్వే బోనస్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రైల్వే పనితీరును మెరుగు పరిచే దిశగా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఈ బోనస్ ఉపయోగపడుతుందని రైల్వే భావిస్తుంది.
తిరుపతి, బరంపురంలలో: తిరుపతితోపాటు ఒడిశా రాష్ట్రం బరంపురంలో భారత విజ్ఞానవిద్య, పరిశోధన సంస్థ (ఐఐఎస్‌ఈఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు, శాశ్వత భవనాల నిర్మాణం కోసం మొత్తంగా 3074.12 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. 2021 చివరికల్లా తిరుపతి, బరంపురంలలో భవనాల నిర్మాణం పూర్తవుతుందనీ, ఈ విద్యాసంస్థల కోసం రెండు రిజిస్ట్రార్ ఉద్యోగాలను సృష్టించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటూ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. అన్ని సదుపాయాలతో 1,17,000 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమయ్యే ఒక్కో క్యాంపస్‌లో 1,855 మంది విద్యార్థులకు సరిపోయేలా సౌకర్యాలు ఉంటాయంది. సైన్సు విద్యలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన బోధనను అందించేందుకు ఐఐఎస్‌ఈఆర్‌లను స్థాపిస్తున్నారు.
మంత్రివర్గ ఇతర నిర్ణయాలు
► జాతీయ వృత్తి శిక్షణా మండలి (ఎన్‌సీవీటీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)లను జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి (ఎన్‌సీవీఈటీ)లో విలీనం చేసే ప్రతిపాదనకు ఆమోదం. వృత్తి విద్య, శిక్షణకు సంబంధించిన సంస్థలను నియంత్రించే అధికారం ఎన్‌సీవీఈటీకి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, నాణ్యమైన కార్మికులను తయారుచేసేందుకు దోహద పడుతుందని కేంద్రం పేర్కొంది.
► పర్యావరణ పరిరక్షణలో సహకారం కోసం భారత్–ఫిన్లాండ్‌ల మధ్య జరిగిన ఒప్పందానికి, పర్యాటక రంగంలో రొమేనియాతో కుదిరిన మరో ఒప్పందానికీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
Published Thu, Oct 11 2018 2:46 AM | Last Updated on Thu, Oct 11 2018 3:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment