నయీమ్‌పై సెంచరీ దాటిన ఫిర్యాదులు!
నాలుగు రోజుల్లో టోల్‌ఫ్రీ నంబర్‌కు 124 ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫిర్యాదులు స్వీకరించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 124 ఫిర్యాదులు వచ్చాయి. నయీమ్ ఎన్ కౌంటర్‌లో మరణించినా.. తొలుత ఫిర్యాదులు చేసేందుకు బాధితులు వెనుకాడారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు మొదటి రోజు కేవలం 14 ఫిర్యాదులే వచ్చాయి. దీంతో ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతామని, బాధితులు ముందుకు రావాలని సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి ప్రకటించడంతో.. ఫిర్యాదులు పెరిగాయి.
ఈ నాలుగు రోజుల వ్యవధిలో 124 ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వాటిలో ఎక్కువ భాగం నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే వచ్చినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్, భూలావాదేవీల సెటిల్‌మెంట్లు, బలవంతపు వసూళ్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. కిడ్నాపింగ్‌కు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఫిర్యాదులన్నీ కూడా నయీమ్ అనుచరులు తమ భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ వస్తున్నాయి.
దీంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఫిర్యాదు చేసే వారు ఆధారాలేమైనా ఉంటే పోలీసు స్టేషన్లలో అందజేయాలని, న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని నచ్చచెబుతున్నారు. ఇక పలు ఫిర్యాదుల్లో సిట్ అధికారులకు సందేహాలు తలెత్తుతున్నాయి. భూలావాదేవీలకు సంబంధించిన సెటిల్‌మెంట్లలో వాస్తవమెంత, నిజమైన బాధితులెవరనే విషయాన్ని తేల్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదులను సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపి పరిశీలన చేయిస్తున్నారు.
సిట్ కస్టడీకి నయీమ్ బంధువులు
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. వారిలో కీలకంగా భావిస్తున్న భార్య హసీనా, అక్క సలీమాతో పాటు ముఖ్య అనుచరులను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయనుంది. ఇప్పటికే కొందరిని విచారించేందుకు అవకాశమివ్వాలని కోర్టును కోరింది. వరుస సెలవుల నేపథ్యంలో ఈ విజ్ఞప్తిపై విచారణ జరగలేదు. మంగళవారం అనుమతి వచ్చే అవకాశముంది. నయీమ్ అరాచకాలన్నీ అతడి భార్య హసీనా, సోదరి సలీమాకు తెలుసనని.. వారి ఆ సమాచారాన్ని రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.