సాక్షి, హైదరాబాద్: కాలిఫట్ స్థాపనే ధ్యేయమంటూ ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆకర్షితుడైన పాతబస్తీ వాసి మహ్మద్ అబుసాని కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ప్రారంభించింది. గత నెలలో ఇతడిపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనిని రీ–రిజిస్టర్ చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు.
ఈ కేసులో కీలకాంశాలు గుర్తించడం కోసం నిందితుడిని కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు సోమ, మంగళవారాలు విచారించారు. అబుసాని బైక్‌పై చార్మినార్–ఫలక్‌నుమా మధ్య ప్రాంతాల్లో పలుమార్లు సంచరించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను అబుసాని నుంచి రాబట్టారు. విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఇతగాడికి సోషల్‌మీడియా ద్వారా కొన్ని లింకులు పంపించాడు. వాటిలో స్థానికంగా లభించే దీపావళి టపాసుల మందు, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు వాడి బాంబులు తయారు చేయడం ఎలా? అనే వివరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
వీటి కోసమే అబుసాని ఆయా ప్రాంతాల్లో సంచరించాడని వెలుగులోకి వచ్చింది. మరికొందరిని ఉగ్రవాద బాట పట్టించడంతో పాటు నిధుల సమీకరణకు ఇతడు ప్రయత్నాలు చేశాడని చెప్తున్నారు. హ్యాండ్లర్ సహా ఇతర ప్రాంతాల్లోని స్లీపర్ సెల్స్‌తో సంప్రదింపుల జరపడానికి ఇతను ఫేస్‌బుక్‌తో పాటు 27 ఇన్‌స్ట్ర్రాగామ్ ఐడీలు, రెండు టెలిగ్రామ్ ఐడీలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా సోషల్‌మీడియా గ్రూపుల్లో ఉబ్జెకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నట్లు తేలింది. అమెరికా, ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేయాలని, బాంబు పేలుళ్లకు పాల్పడటం ద్వారా భయోత్పాతం సృష్టించాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు ఉన్నాయని సమాచారం.
హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంబసీల వద్ద రెక్కీ చేసి, అనువైన దాన్ని గుర్తించాలని ఆన్‌లైన్ ద్వారా హ్యాండ్లర్ ఆదేశించాడు. ఓ పక్క అబుసాని ఈ ప్రయత్నాల్లో ఉండగానే హ్యాండ్లర్ నిర్వహిస్తున్న టెలిగ్రామ్ గ్రూపులో ఇటీవల మరో సందేశం వచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నేషనల్ క్యాపిటల్ బ్యాంక్ వద్ద పేలుడుకు సిద్ధం కావాలంటూ అందులో సూచించాడు.
దీనికి తాను సిద్ధమంటూ అబుసాని అదే గ్రూపులో పోస్టు చేశాడు. బాంబుల తయారీని సూచించే లింకుల్ని ఓపెన్ చేసినట్లు పోలీసులు చెప్తున్నా ప్రయోగాలు చేశాడా? లేదా? అనే తేలాల్సి ఉందన్నారు. అబుసాని ఫోన్‌ను విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఈ వార్త కూడా చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్..
Comments
Please login to add a commentAdd a comment