మరో పోరాటానికి సిద్ధం కావాలి: సురవరం
- హక్కులు, స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి
- రావి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఘననివాళి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కాపాడుకునేందుకు, రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమం వంటి మహత్తర పోరాటం రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. మతవాద బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యంపై, హక్కులపై, మతతత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వామపక్షాలు, ప్రజాతంత్ర, సెక్యులర్, మైనారిటీ, దళితులు అందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. శనివారం తెలంగాణ అమరవీరుల ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 108వ జయంతి సభకు సురవరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రావి నారాయణరెడ్డి విగ్రహానికి సురవరం, ట్రస్టు బాధ్యులు, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలి..
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, కమ్యూనిస్టులకు.. ఆ పోరు చివర్లో ముస్లిం లపై జరిగిన దాడులకు ఎలాంటి సంబంధం లేదని సురవరం చెప్పారు. అది హిందు- ముస్లింల మధ్య జరిగిన పోరాటం కాదని.. ఫ్యూడలిజానికి, ప్రజలను, హక్కులను అణచివేసిన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకోలేకపోవడం సాయుధ పోరాటానికి, ప్రజలకు తీరని అవమానకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ చరిత్ర తెలుసుకుని, తెలంగాణ సాయుధ పోరాటానికి తగిన గుర్తింపునివ్వాలని, అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.
మజ్లిస్ పార్టీ ఒత్తిడి కారణంగానే ఇంతకాలంగా అధికారిక ఉత్సవాలను నిర్వహించ లేదని, తెలంగాణ ఏర్పడ్డాక ఈ పోరాటాన్ని గుర్తిస్తామన్న కేసీఆర్ కూడా నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం ప్రమాదం అంచుల్లో ఉందని, వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తులు ఒక వేదికపైకి వచ్చి దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు, ట్రస్టు అధ్యక్షు డు బూర్గుల నరసింగరావు, ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి, చెన్నమనేని హనుమంతరావు తదితరులు మాట్లాడారు.