బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రద్దు!
► కేంద్రం తెచ్చిన కొత్త బిల్లు నేపథ్యంలో అవకాశం
► 70 ఏళ్ల వయసు నిబంధనతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్‌కు తప్పని ఉద్వాసన
► అదే జరిగితే కొత్త ట్రిబ్యునల్ ముందుకు కృష్ణా జలాల వివాదం
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు–2017 పార్లమెంటు ఆమోదం లభిస్తే కృష్ణా జల వివాదాలను విచారిస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న కృష్ణా వివాదాలపై విచారణ కేంద్రం తెచ్చే కొత్త ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతుంది.
ఏళ్ల తరబడి విచారణ జరుగుతున్నా...
దేశంలో ప్రస్తుతమున్న కృష్టా సహా ఎనిమిది ట్రిబ్యునళ్లు అంతర్రాష్ట్ర జల జగడాలపై ఏళ్ల తరబడి విచారణ జరుపుతున్నా వివాదాలకు పరిష్కారం దొరకట్లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుత ట్రిబ్యునళ్లను రద్దు చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే సవరణ బిల్లును కేంద్రం ఈ నెల 14న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. అయితే ‘ప్రతిపాదిత చట్టం అమల్లోకి రాగానే పాత ట్రిబ్యునళ్లన్నీ రద్దవుతాయి. వాటి పరిధిలోని వివాదాలన్నీ కొత్త ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి’ అని బిల్లులో స్పష్టంగా ఉంది. దీనికి ఎలాంటి సవరణలు లేనట్లయితే ప్రస్తుతమున్న కృష్ణా సహా కావేరీ, వంశధార, మహదాయి, రావి వంటి ట్రిబ్యునళ్లు రద్దవుతాయి.
అలాగే ప్రస్తుత ట్రిబ్యునళ్ల చైర్మన్‌లు, సభ్యుల వయసు కొత్త చట్టం వచ్చే నాటికి 70 ఏళ్లు నిండితే వారి పదవీకాలం సైతం మూడు నెలల్లో ముగుస్తుందని బిల్లులో కేంద్రం పేర్కొంది. ఈ నిబంధన కూడా 70 ఏళ్లు పైబడిన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్‌కు ఉద్వాసన పలికేలా ఉంది. అయితే ‘ఇప్పటికే అమల్లో ఉన్న ట్రిబ్యునళ్లు నీటి వివాదాలపై విచారణ పూర్తి చేసి కేటాయింపులు జరిపినట్లయితే కొత్త ట్రిబ్యునల్ ఆ వివాదాలను పునర్విచారించదు’ అని బిల్లులో కేంద్రం పొందుపరిచిన మరో నిబంధన గందరగోళానికి తావిచ్చేలా ఉంది. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను పూర్తి చేసినా తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించడం, ట్రిబ్యునల్ కేటాయింపులపై రాష్ట్రం అప్పీల్ చేయడంతో ఆ కేటాయింపులు అవార్డు కాలేదు. ఈ దృష్ట్యా ఇక్కడ విచారణ పూర్తయినట్లా లేదా కొనసాగుతున్నట్లా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తమకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును గట్టిగా సమర్థించిన తెలంగాణకు ఇది పెద్ద ఉపశమనమేనని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి.