ఈస్ట్, వెస్ట్‌లకు కొత్త కమిషనర్లు
సైబరాబాద్ వెస్ట్ సీపీగా నవీన్‌చంద్, ఈస్ట్ సీపీగా భగవత్
- రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ
- వ్యక్తిగత సెలవుల్లో సీవీ ఆనంద్.. పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్లను దృష్టిలో పెట్టుకొని తాజా మార్పులు చేసింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్‌లు వి.నవీన్‌చంద్‌ను సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా, మహేశ్ మురళీధర్ భగవత్‌ను సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం నవీన్‌చంద్ వెయిటింగ్‌లో ఉండగా.. భగవత్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐజీగా ఉన్నారు.
ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లనుండటంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు ప్రస్తుతం గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా.. ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ సీపీగా పని చేస్తున్న టి.వి.శశిధర్‌రెడ్డి సైబరాబాద్ ఈస్ట్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల విభాగం పర్యవేక్షిస్తున్న ఐజీ ఎంకే సింగ్‌ను పోలీసు అకాడమీ అడిషనల్ డెరైక్టర్‌గా, డి.కల్పనా నాయక్‌ను డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల విభాగం డీఐజీగా, సీనియర్ అధికారి వీవీ శ్రీనివాసరావును హైదరాబాద్ సిటీ పోలీసు అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు. గతంలో ఈ పోస్టుకు సందీప్ శాండిల్యను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆయన ప్రస్తుత స్థానంలోనే ఉంటారు.
కొత్త పేరు పెడదాం: సీఎం కేసీఆర్
ఈస్ట్, వెస్ట్‌లు వద్దని.. సైబరాబాద్ ఈస్ట్‌కు కొత్త పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. తనను కలసిన పోలీసు ఉన్నతాధికారులతో అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఏర్పాటు చేసిన మూడు కమిషనరేట్లలో హైదరాబాద్, సైబరాబాద్ పేర్లను యథాతథంగా ఉంచి, కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతి చాటేలా కొత్త పేరు ఉండేలా ఆలోచన చేయాలని సూచించారు.