
‘పాలమూరు’లో కొత్త రిజర్వాయర్
నిర్ణయించిన ప్రభుత్వం..
రూ. 2,600 కోట్ల అంచనా
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకింద ఇప్పటికే నిర్ణయించిన ఆరు రిజర్వాయర్లకు తోడు మరో రిజర్వాయర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ల మధ్య అంతారం వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మించేలా తాజాగా ప్రణాళికలు తయారు చేసింది. కొత్త రిజర్వాయర్ నిర్మాణంపై ఓ వైపు కసరత్తు పూర్తి చేస్తూనే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్, ఇతర కాల్వల పనుల అంచనాలను సిద్ధం చేసే పనిలో పడింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మొత్తంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్‌లతో పాటు కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌లను ప్రతిపాదించారు.
ఇందులో ఇప్పటికే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా అన్ని రిజర్వాయర్‌ల సర్వే, అంచనాలు పూర్తి చేసి రూ.30 వేల కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం మూడు, నాలుగు ప్యాకేజీలు మినహా అన్ని చోట్లా పనులు ఆరంభమయ్యాయి. ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉండటంతోపాటు, ఇందులో 35 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్‌తో పాటు మరో 5 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు.
దాంతో ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన పనిగా గుర్తిం చారు. కెనాల్, టన్నెల్ పరిధిలోని భూములన్నీ రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైనవి కావడంతో దీనికి ప్రత్యామ్నాయాలను వెతికిన నీటి పారుదల శాఖ, అంతారం వద్ద మరో రిజర్వాయర్ నిర్మాణం అం శాన్ని తెరపైకి తెచ్చింది. ఉద్దండాపూర్ నుంచి 100 మీటర్ల లిఫ్టుతో అంతారానికి నీటిని తరలించడం అత్యంత సులభమని అధికారులు తేల్చారు. ఇక్కడ 16 టీఎంసీల నీటిని నిల్వ చేసే అనువైన ప్రదేశం ఉందని గుర్తించి సర్వే పనులు పూర్తి చేశారు. అం తారం రిజర్వాయర్‌ను చేపడితే పరిగి, తాండూర్‌లలోని మొత్తం ఆయకట్టు, వికారాబాద్‌లోని కొంత ఆయకట్టుకు నీటిని అందించడం సులువవుతుందని పేర్కొంటున్నారు. దీనికోసం రూ. 2,600 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర హై పవర్ కమిటీ ఆమోదం తెలిపిందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.