సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈసారి పూర్తిగా ఏకపక్షమైపోయాయి. ఆద్యంతం అధికార పార్టీయే కేంద్రంగా కొనసాగాయి. సమావేశాల తొలిరోజునే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంతో.. మజ్లిస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులు మాత్రమే మిగిలిన విషయం తెలిసిందే. ఇలా ప్రధాన ప్రతిపక్షం లేకుండానే, లోతైన చర్చ ఏదీ జరగకుండానే.. కీలకమైన ప్రైవేటు వర్సిటీల బిల్లు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీల బిల్లులు ఆమోదం పొందాయి. వర్సిటీల బిల్లు ఎప్పుడో సిద్ధమైనా వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వెనుకాడింది.
ప్రస్తుత సమావేశాల తొలి రోజున నిర్వహించిన బీఏసీ సమావేశంలోనూ ఆ బిల్లు ప్రస్తావనే లేదు. కానీ కాంగ్రెస్ సభ్యులందరినీ సస్పెండ్ చేశాక అధికారపక్షం ఈ బిల్లును ఆమోదించుకుంది. వీటితో పాటు వివిధశాఖల పద్దులు, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపైనా లోతుగా చర్చ జరగకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్షం లేకపోవడంతో కొన్ని అంశాల్లో టీఆర్‌ఎస్ సభ్యులే ప్రతిపక్షంగా వ్యవహరించారు.శాసన మండలిలోనూ యూనివర్సిటీల బిల్లు, ఇతర సమస్యలపై కొందరు సభ్యులు ఆయా శాఖల మంత్రులను ప్రశ్నించారు.
శాసనసభలోనైతే గ్రామీణ రోడ్లపై చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేసింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. మిర్యాలగూడలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కాంగ్రెస్‌ను వదిలి టీఆర్‌ఎస్‌లో చేరినందుకే నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా ఉందని సభలోనే నిరసన వ్యక్తం చేశారు. ఇక టీఆర్‌ఎస్‌కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా.. రోడ్ల నిర్మాణం, అధికారుల తప్పుడు నివేదికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్చలే తప్ప నిలదీసే ప్రతిపక్షం లేకపోవడంతో.. మంత్రులకు కూడా ఎక్కువగా వివరాలు ఇస్తూ సమాధానాలు చెప్పాల్సిన పని లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment