ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వలేదు
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో క్షతగాత్రులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదని ఎన్‌ఐఏ కోర్టు అభిప్రాయపడింది. తీవ్రగాయాలైన 78 మందికి పరిహారం ఖరారు చేయాలని న్యాయ సేవాధికార సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తీర్పు కీలక అంశాలను శనివారం ప్రస్తావించిన కోర్టు.. ఏ వన్ మిర్చీ సెంటర్ నిర్వాహకుడికి రూ. లక్ష ఇవ్వాలని, పేలుళ్లలో 107 బస్టాప్ దెబ్బతిన్నందున ఆర్టీసీకి రూ. 50 వేలు ఇవ్వాలని ఆదేశించింది.
ఈ కేసులో అనేక కోణాలు పరిశీలించాకే ఉరిశిక్ష విధించినట్లు 697 పేజీల తీర్పులో కోర్టు వెల్లడించింది. దోషులు జిహాద్ పేరుతో అమాయకుల ప్రాణాలను తీశారని, వారి సిద్ధాంతం చాలా ప్రమాదకరంగా ఉందని పేర్కొంది. చట్టాల నుంచి తప్పించుకోవడంలో దోషులు సుశిక్షితులుగా ఉన్నారని.. తమకు తాము హీరోలుగా భావించారని అంది. పేలుడు పదార్థాలు సరిపోతే.. మరో బాంబుకూడా పేల్చేవారని.. కోఠీ, అబిడ్స్, బేగంబజార్, సీబీఐ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారని ఎన్‌ఐఏ కోర్టు పేర్కొంది.