
‘సాక్షి’తో నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎల్.నరేంద్రనాథ్
ఆస్పత్రిలో మొత్తం 1030 పడకలు ఉండగా, ఆక్యుపెన్షీ రేషియో మాత్రం 80 శాతానికి మించడం లేదు. అంటే సుమారు 200 పడకలు వినియోగానికి నోచుకోవడం లేదు.
సాక్షి, సిటీబ్యూరో : ‘ఆపదలో ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికి వైద్యం అందించడమే మా లక్ష్యం. పేషంట్ కేర్‌కు పెద్దపీట వేస్తాం. వైద్యులందరి సహకారంతో ఆస్పత్రిని ఎయిమ్స్ స్థాయికి తీసుకెళ్తాం. అత్యవసర విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రోగులను ఆదుకుంటాం’ అని ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డెరైక్టర్ పద్మశ్రీ ఎల్.నరేంద్రనాథ్ స్పష్టం చేశా రు. నిమ్స్ డెరైక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నరేంద్రనాథ్ గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...!
ఆస్పత్రిలో మొత్తం 1030 పడకలు ఉండగా, ఆక్యుపెన్షీ రేషియో మాత్రం 80 శాతానికి మించడం లేదు. అంటే సుమారు 200 పడకలు వినియోగానికి నోచుకోవడం లేదు. పడకల కొరత పేరుతో అత్యవసర విభాగంతోపాటు న్యూరో, యూరాలజీ విభాగాల్లో కొత్త రోగులను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. నిజానికి ఏ వార్డుల్లో ఎన్ని పడకలు ఉన్నాయి? వాటి వినియోగం? తదితర అంశాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. వార్డుల్లో ఖాళీగా ఉన్న పడకలను రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న విభాగాలకు తరలిస్తాం. పడకల కొరత లేకుండా చూస్తాం.
రోగుల బంధువులకు మరుగుదొడ్ల ఏర్పాటు
ఆస్పత్రిలో నిత్యం వెయ్యిమందికి పైగా చికిత్స పొందుతుంటే వారికి సాయంగా వచ్చిన మరో 1500 -2000 మంది ఆస్పత్రి బయటే పడిగాపులు కాయాల్సి వస్తోంది. వీరికోసం ఈ నెలాఖరుక ల్లా అవసరమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తాం. ప్రతి వార్డులోనూ ఫ్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేసి మంచినీటి కొరతను తీరుస్తాం.
ఆరోగ్యశ్రీ రోగుల ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి
ఇక్కడ చికిత్స పొందుతున్న రోగుల్లో 80-90 శాతం మంది ఆరోగ్యశ్రీ బాధితులే. రాష్ట్రంలో ఏ ఆస్పత్రీ ఇంతమంది రోగులకు సేవ చేయడం లేదు. కానీ కొంతమంది ఇక్కడ ఉచిత పరీక్షలు చేయించుకుని, రిపోర్టులు వచ్చిన తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఆస్పత్రి విలువైన సమయంతోపాటు ఆదాయాన్నీ కోల్పొవాల్సి వస్తోం ది. రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడం లేదనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి
రోగుల ఆరోగ్యం కాపాడటమే కాదు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. ప్రభుత్వం గత రెండేళ్లుగా వార్షిక బడ్జెట్‌లో ఆస్పత్రికి రూ.50 కోట్లకు పైగా కేటాయిస్తుండగా, అంతర్గత రోగుల నుంచి నెలకు మరో రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతుంది. సిబ్బం ది నెలసరి వేతనాలకు రూ.8 కోట్లు, నిర్వహణ ఖర్చులకు మరో రూ.2 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిం చి ప్రస్తుతం వారి నుంచి సమకూరుతున్న ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.
స్థానికులకే ప్రాధాన్యం
బీబీనగర్ నిమ్స్ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. స్థానికుల అవసరాలకే ఇక్కడ తొలి ప్రాధాన్యం. ఇక్కడ ఒక రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు ట్రామా కేర్ యూనిట్‌తో పాటు గ్రామీణ మహిళల అవసరాల కోసం ఓ గైనిక్ వార్డును సైతం ఏర్పాటు చేస్తాం. స్థానికుల అవసరాలు పూర్తిగా తీర్చిన తర్వాతే ఈ క్యాంపస్‌ను ఇతర అవసరాలకు వినియోగిస్తాం.
పారదర్శక పాలన
వైద్య పరికరాలు, హృద్రోగులకు అమర్చే స్టంట్లు, మోకాలి మార్పిడి చిప్పల కొనుగోళ్ల వ్యవహారంపై గతంతో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన మాట వాస్తవమే. ఇకపై ఏ చిన్న విమర్శకూ తావివ్వం. పరిపాలనలో పారదర్శకత కోసం ఇకపై ప్రతి వస్తువు ఆన్‌లైన్ టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తాం. కొత్త ఉద్యోగుల నియమాకాల్లోనూ ఇదే పద్ధతిని పాటిస్తాం.