ఎండలతో తెలంగాణ మండిపోతోంది. సోమవారం వడ గాడ్పుల తీవ్రత మరింత పెరిగింది.
- గ్రేటర్‌లో 43 డిగ్రీల రికార్డు ఎండ
- రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు
సాక్షి, హైదరాబాద్/ నిర్మల్ రూరల్: ఎండలతో తెలంగాణ మండిపోతోంది. సోమవారం వడ గాడ్పుల తీవ్రత మరింత పెరిగింది. అనేక చోట్ల 40 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 44.5, ఆదిలాబాద్‌లో 44, హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మెదక్, నల్లగొండ, నిజామాబాద్‌లలో 43 డిగ్రీలు.. భద్రాచలం, ఖమ్మం, రామగుండంలలో 42 డిగ్రీలు, హకీంపేటలో 41, హన్మకొండలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని.. వడగాడ్పులు తీవ్ర మయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండతీవ్రత వల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని సీపీడీసీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా ప్రభుత్వం ప్రకటించిన వేసవి ప్రణాళిక సక్రమంగా అమలవడం లేదని విమర్శలొస్తున్నాయి. హైదరాబాద్‌లో స్కూళ్లను మధ్యాహ్నం కాకుండా ఉదయం 11 గంటల వరకే నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.