మాది పంచసూత్ర ప్రణాళిక | NITI Aayog mulling big reforms in agriculture sector | Sakshi
Sakshi News home page

మాది పంచసూత్ర ప్రణాళిక

Published Fri, Jul 8 2016 2:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

మాది పంచసూత్ర ప్రణాళిక - Sakshi

మాది పంచసూత్ర ప్రణాళిక

- టాస్క్‌ఫోర్స్‌కు సర్కారు నివేదిక
- సాగుకు రూ.22,333 కోట్లు అవసరమని అంచనా
- నాలుగేళ్లలో సుస్థిర అభివృద్ధికి ప్రణాళిక

 
 సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లలో సుస్థిర వ్యవసాయ వృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం రూ. 22,333.22 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలో వ్యవసాయశాఖపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి సమర్పించింది.
 
 భూముల సమర్థ వినియోగం, సాగునీటి వసతి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పంట రుణాలు-పంటల బీమా, మార్కెటింగ్.. ఈ ఐదు అంశాలే తెలంగాణలో వ్యవసాయ సుస్థిర వృద్ధికి అనుసరించే పంచ సూత్రాలని అభివర్ణించింది. 2015-16 నుంచి 2018-19 వరకు నాలుగేళ్ల వ్యవసాయ సాగు ప్రణాళికలు, చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రభుత్వం ఈ నివేదికలో పొందుపరిచింది. దీంతోపాటు ఉద్యానవన శాఖ, పశువుల పెంపకం, మత్స్య అభివృద్ధి, మార్కెటింగ్ వసతులు, రైతుల రుణాలకు సంబంధించి సహకార శాఖ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను, అనుసరించాల్సిన భవిష్యత్ ప్రణాళికలను ప్రస్తావించింది. ఆయా రంగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే నిధుల అంచనాలను పొందుపరిచింది.
 
 నివేదికలో పేర్కొన్న అంశాలు
 తెలంగాణ జనాభాలో 55.7 శాతం రైతులు, వ్యవసాయ కూలీలున్నారు. 2006-07 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 18.2 శాతమున్న వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా.. గతేడాది 13.86 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 56.90 లక్షల హెక్టార్లు.
 
 ప్రభుత్వ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం నాలుగేళ్లలో 3 లక్షల హెక్టార్ల మేర, పప్పు ధాన్యాల విస్తీర్ణం లక్షన్నర హెక్టార్లు, నూనె గింజల సాగు 2 లక్షల హెక్టార్లకు పైగా పెరుగుతాయి. ప్రస్తుతం 16.50 లక్షల హెక్టార్లలో వరి సాగు, 15.38 లక్షల హెక్టార్లలో ఉన్న పత్తి సాగు విస్తీర్ణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండదు. ఏటేటా మొక్కజొన్న, సోయాబీన్ పంటల విస్తీర్ణం పెరుగుతుంది.
 
 రాష్ట్రంలో విత్తనాల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణంతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్, ఐసీఏఆర్ తదితర పరిశోధన సంస్థలుండటం కలిసొచ్చే పరిణామం. అందుకే విత్తన తయారీ, సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బయోటెక్ లేబొరేటరీతో పాటు విత్తనాల నిల్వ, సీడ్ బ్యాంక్ నిర్వహణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంది.
 
 పసుపు సాగులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పళ్ల సాగు విస్తీర్ణంలో 3వ స్థానంలో, ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉంది. కూరగాయల సాగు విస్తీర్ణంలో 11వ స్థానంలో, ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌తో పోలిస్తే కూరగాయల ఉత్పత్తి కేవలం 20 శాతమే ఉంది. సరిపడా కోల్డ్ స్టోరేజీలు, రెపైనింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంది. దీంతోపాటు నీటి సమర్థ వినియోగానికి  పాలిహౌస్‌లు, మైక్రో ఇరిగేషన్ పద్ధతులు విస్తరించాలి. హైబ్రిడ్ కూరగాయల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు అనువైన కొత్త పద్ధతులు అవలంబించాల్సి ఉంది. రైతులకు తగిన శిక్షణ, సాంకేతిక సహకారం అందించాలి.
 
 వ్యవసాయానికి దీటుగా కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకంపై దృష్టి సారించాల్సి ఉంది. పాడి పశువుల పెంపకం, డెయిరీ డెవలప్‌మెంట్‌ను  ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వాలి. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు, పశు ఆరోగ్య కేంద్రాలను విస్తరించాల్సి ఉంది.  డెయిరీ ప్లాంట్లను అధునాతన పరికరాలున్న యూనిట్లుగా మార్చాలి.  గొడ్డు మాంసం ఎగుమతికి ఇప్పుడున్న పాలసీని సడలించాలి.
 
 రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ఐదేళ్లలో 4.05 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి అవసరమయ్యే గోదాములు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, రెపైనింగ్ చాంబర్లు దశల వారీగా నిర్మించాలి. ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు వీలుగా మార్కెట్ యార్డులను కంప్యూటరీకరించాలి. మార్కెటింగ్ మెలకువలు, ధరల హెచ్చుతగ్గుల సరళిని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసే వ్యవస్థలను నెలకొల్పాలి.
 
 చెరువులు, కుంటలన్నింటా చేపలను పెంచాలి. రాష్ట్రంలో 19.04 లక్షల మంది మత్స్యకారులున్నారు. 78 రిజర్వాయర్లతో పాటు 35,031 చెరువులు, 474 కుంటలున్నాయి. ఇవన్నీ 781 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటితో పాటు 5,573 కిలోమీటర్ల పొడవునా నదులు, కాలువలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు చేపల పెంపక కేంద్రాలను అభివృద్ధి చేయడం, రాష్ట్రస్థాయిలో ఫ్రెష్ వాటర్ ఫిష్ బ్రీడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం, కొత్తగా 110 మార్కెట్లను నెలకొల్పడంతో పాటు 5,000 మొబైల్ ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
 
 వ్యవసాయానికి సరిపడా రుణాలిచ్చి రైతులను ప్రోత్సహించాలి. రైతులకు పంట రుణాల పరిమితి పెంచాలి. వ్యవసాయ విస్తరణ, శిక్షణ, మార్కెటింగ్‌కు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను నోడల్ ఏజెన్సీగా మార్చాలి. పీఏసీఎస్‌లలో చౌక ధరల దుకాణ కేంద్రా లు నెలకొల్పాలి. సొసైటీలను మల్టీ పర్పస్ సర్వీస్ సెంట ర్లుగా తీర్చిదిద్దాలి. భూసార పరీక్షలు మొదలు పంట ఉత్పత్తుల అమ్మకాల వరకు రైతులకు అవసరమైన సేవలన్నీ అక్కడ అందుబాటులో ఉంచాలి.
 
 నాలుగేళ్ల ప్రణాళికకు అవసరమయ్యే నిధులు (రూ.కోట్లలో)
 వ్యవసాయం    9,798.36
 జయశంకర్ విశ్వవిద్యాలయం    45.35
 ఉద్యానవన శాఖ    4,151.70
 హార్టికల్చర్ విశ్వవిద్యాలయం    1,561.02
 పశు సంవర్థక శాఖ    1,768.73
 పీవీఎన్‌ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ    223
 మత్స్యశాఖ    393.11
 సెరికల్చర్    152.06
 సహకార శాఖ    2,569.89
 వ్యవసాయ మార్కెటింగ్    1,670
 మొత్తం    22,333.22

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement