నిజాం దక్కన్ షుగర్స్‌లో తేలిన వాటాలు
♦ డెల్టా పేపర్ మిల్స్ ఈక్విటీ రూ.48.15 కోట్లు
♦ జాయింట్ వెంచర్ ఆస్తులు, అప్పుల మదింపు
సాక్షి, హైదరాబాద్: నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నియమించిన ఎస్‌బీఐ క్యాప్స్ సంస్థ ఆస్తులు, అప్పులపై నివేదిక సమర్పించింది. ఈక్విటీ షేర్లు, ఇతర వాటాలు, రుణాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని మదింపు చేసి న ఎస్‌బీఐ క్యాబ్స్ భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్‌మిల్స్ వాటాను 58.67%గా తేల్చింది. ఈ లెక్కన రూ.48.15 కోట్ల ఈక్విటీని చెల్లిస్తే ఎన్‌డీఎస్‌ఎల్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే వీలుంటుందని సిఫారసు చేసింది. సంయుక్త భాగస్వామ్య సంస్థ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్‌డీఎస్‌ఎల్)లో ప్రస్తుతం నిజాం షుగ ర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఎల్), డెల్టా పేపర్‌మిల్స్ (డీపీఎం) భాగస్వాములుగా ఉన్నాయి.
2002 ఆగస్టు 28న ఈ రెండు భాగస్వామ్య సంస్థల నడుమ కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్‌ఎస్‌ఎల్ వాటా 49 శాతం కాగా, డీపీఎం వాటా 51 శాతం. ఈ నేపథ్యంలో ఎన్‌డీఎస్‌ఎల్ నిర్వహణ బాధ్యతను డెల్టా పేపర్ మిల్స్ చేపట్టింది. కాగా నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 సీజన్ నుంచి చెరుకు క్రషింగ్ చేయలేమంటూ ఎన్‌డీఎస్‌ఎల్ భాగస్వామ్య సంస్థ డీపీఎం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌డీఎస్‌ఎల్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ‘కార్యదర్శుల కమిటీ’కి అప్పగించింది. ఎన్‌డీఎస్‌ఎల్ ఆస్తులు, అప్పులు తదితరాలను మదింపు చేసే బాధ్యతను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెటింగ్ లిమిటెడ్ (ఎస్‌బీఐ క్యాప్స్) అనే సంస్థకు కార్యదర్శుల కమిటీ అప్పగించింది.