నో బ్యూటీ.. అంతా డర్టీ! | No beauty .. all dirty! | Sakshi
Sakshi News home page

నో బ్యూటీ.. అంతా డర్టీ!

Published Mon, Jul 4 2016 11:32 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

నో బ్యూటీ.. అంతా డర్టీ! - Sakshi

నో బ్యూటీ.. అంతా డర్టీ!

సిటీబ్యూరో: గ్రేటర్‌లోని చెరువుల్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ హామీలు అమలుకు నోచడం లేవు. కాంక్రీట్ జంగిల్‌లో, కాలుష్య వాతావరణంలో విసిగి వేసారుతున్న నగర ప్రజలకు హాయినిచ్చే ఆహ్లాదకేంద్రాలుగా,  పిక్నిక్‌స్పాట్‌లుగా వీటిని  తీర్చిదిద్దుతామన్న వాగ్దానాలు రంగుల కలలుగా మిగిలాయి. రెండేళ్లనుంచి అదిగో.. ఇదిగో అం టున్నప్పటికీ పనులు మాత్రం జరగడంలేదు. అందుబాటులోని స్థలాన్ని బట్టి అన్ని చెరువులనూ యూనిఫామ్‌గా నడక మార్గాలు, బెంచీలు, కెఫ్టేరియా, టాయ్‌లెట్లు, పార్కింగ్ వంటి సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతామని అద్భుతచిత్రాల్ని చూపిన అధికార యంత్రాంగం వాస్తవంగా పనులు చేయడం లేదు. తొలిదశలో 63 చెరువుల్ని  ఆహ్లాదకేంద్రాలు చేస్తామన్నప్పటికీ, ఇంతవరకు ఒక్క చోట కూడా పనులు పూర్తిచేయలేదు. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్,  నీటిపారుదల శాఖలకు ఆయా చెరువుల బాధ్యతలు అప్పగించగా,  ఏదీ తమ పనులు చేయలేదు. కొన్ని చెరువులకు ఫెన్సింగ్ తప్ప జరిగిన పనంటూ లేదు.


సదరు పనుల్లోనూ నాణ్యత లోపాలు కనబడుతున్నాయి.  కేవలం గుర్రపుడెక్క తొలగింపు, ఫెన్సింగ్ మాత్రమే మా పని అని సంబంధిత ఇంజినీర్లు చెబుతున్నారు.  అసలు ఆ స్థలం తమదంటూ ప్రైవేట్‌వ్యక్తులు గొడవ చేస్తుండటంతో వెనుకడుగు వేస్తున్నారు. పనులు చేపట్టే ముందే ఎఫ్‌టీఎల్‌లను గుర్తించామన్న అధికారులు.. ఇప్పుడు ప్రైవేటు శక్తుల ఆగ డాలకు పనులు ఆపడం వెనుక మతలబులేమిటో వారికే తెలియాలి. ఇక గుర్రపు డెక్క తొలగించేది ఒకరు.. చెరువు స్థలాన్ని చదును చేసేది ఒకరు.. పచ్చిక మైదానాలు పెంచేది ఒకరు...కెఫ్టేరియా సదుపాయాలు మరొకరు, నడకమార్గాలు మరొకరంటూ మాటలు చెబుతున్నారు. ఒక్క చెరువు పనులకు ఇన్ని విభాగాలమధ్య సమన్వయం కుదిరి, పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఎన్నాళ్లవుతుందో.. ఎన్నేళ్లవుతుందో.. వేచి చూడాల్సిందే..
 
 
శంకుస్థాపనతో సరి ..

రామంతాపూర్: రామంతాపూర్ చిన్న చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల కోసం రూ. 64 లక్షలు మంజూరయ్యాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్  శంకుస్థాప చేసి ఆరునెలలు గడుస్తున్నా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. చెరువులోని గుర్రపుడెక్కను మాత్రం తొలగించారు.  జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులు గతనెలలో రూ. 25 లక్షలతో వాకింగ్ ట్రాక్ పనులు చేపట్టారు. చెరువు భూమి తమదంటూ కబ్జాదారులు బెదిరించడంతో పనులను నిలిపివేశారు. ఈ చెరువు సమీపాన ఉన్న కాలనీల నుండి వచ్చే మురుగునీరు చెరువులోకి చేరడంతో కలుషితంగా మారిపోయింది. దీంతో స్థానికంగా దుర్వాసన వెదజల్లడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమైపోయి బోరు పంపులలో రంగుతో కూడిన కలుషిత నీరు వస్తుంది. చిన్న చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో చెత్తకుప్పలు, నిర్మాణ వ్యర్ధాలను ఇష్టానుసారంగా వేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.  ఇదే సర్కిల్ సరిధిలోని  నల్లచెరువుకు శంకుస్థాపన తప్ప జరిగిందేమీ లేదు. పనులంటూ ప్రారంభమే కాలేదు. నాగోల్‌చెరువు పనులు ఫెన్సింగ్ పూర్తయ్యాక అర్ధంతరంగా ఆగిపోయాయి. అంతకుమించి ముందుకు కదలడం లేదు. స్థానికుల అభ్యంతరాలతో.. స్థలం తమదనే ప్రైవేటు వ్యక్తుల గొడవలతో పనుల్ని నిలిపి వేశారు. దాదాపు రూ. 25 లక్షలు ఖర్చు చేసి అలా వదిలేశారు.
 
 
అన్ని చెరువుల వద్ద యూనిఫామ్‌గా చేయాల్సిన పనులు చెరువు ఒడ్డున, ఫెన్సింగ్ లోపలఎఫ్‌టీఎల్ మేర పచ్చిక మైదానాలు.. ఫౌంటెన్లు  వాక్ వేలు పబ్లిక్ టాయ్‌లెట్లుపచ్చదనం పెంపునకు వివిధ రకాల మొక్కలు రాత్రివేళ సుందరంగా కనిపించేందుకు ప్రత్యేక లైటింగ్ స్నాక్స్, టీ, కాఫీ, తదితరమైనవి లభించే కెఫ్టేరియా   వాన నీరు నిల్వ ఉండకుండా బైపాస్ డ్రెయిన్లువాహనాలకు పార్కింగ్ సదుపాయం   కానీ ఎక్కడా ఇంతవరకు  చెరువు ప్రక్షాళన పనులే పూర్తికాలేదు. ఈ సదుపాయాలకు ఇంకెంతకాలమో అధికారులే చెప్పాలి.
 
 
ఆగని ఆక్రమణలు..

 కుత్బుల్లాపూర్: జీడిమెట్ల డివిజన్ పరిధిలో 43 ఎకరాల్లో విస్తరించి ఉన్న వెన్నలగడ్డ ఎన్నా చెరువు చుట్టూ ఎఫ్‌టీఎల్ పరిధిని గుర్తించినప్పటికీ ఆక్రమణలు పెరిగిపోయాయి. ఇక్కడ సుం దరీకరణ పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. మొత్తం రూ.3.28 కోట్లతో ఈ చెరువును ఆధునీకరించేందుకు అంచనాలు రూపొందించినప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. దోమల బెడదతో, తీవ్ర దుర్గం ధంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
     
సూరారం గ్రామానికి ఆనుకుని 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సూరారం చిన్నబంధం చెరువులో మొత్తం నాచు పేరుకుపోయింది.. తుమ్మ చెట్లు మెలిచాయి. ఇక్కడ ఎలాంటి సుందరీకరణ పనులు జరగడం లేదు. గాజులరామారంలో 12 ఎకరాల విస్తీర్ణంలోని  చింతల్ చెరువు అభివృద్ధి పనులకు రూ. 39.5 లక్షలు మంజూరైనా ఇప్పటి వరకు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్రైవేట్ వ్యక్తులు బోర్లు వేసి నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చెరువుకు వచ్చే కట్ట కాలువలు వెళ్లే మార్గంలో దేవేందర్‌నగర్, రావి నారాయణరెడ్డినగర్, బతుకమ్మబండ కాలనీలు ఏర్పడి కబ్జాల పర్వం కొనసాగగా ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి చుక్క నీరు చేరలేదు. పక్కనే ఉన్న ప్రైవేట్ వెంచర్ నుంచి డ్రైనేజీ నీరు చెరువులోకి చేరుతోంది.
 
 
దోమల నిలయాలుగా..

నాచారం: కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలో హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువు, నాచారంలో  ఎర్రకుంట, పటేల్ కుంట చెరువులు దోమల  వృద్ధి కేంద్రాలుగా మారాయి. ఇందుకు కారణమైన చెరువుల్లోని గుర్రపుడెక్కను తొలగించి సుందరీకరణ పనులు చేస్తామన్న హామీలు వాగ్దానాలకే పరిమితమయ్యాయి.
 
 
అన్నింటిదీ అదే తీరు..

రాయదుర్గం/శేరిలింగంపల్లి/ మియాపూర్: నానక్‌రాంగూడ ఐటీ జోన్‌లోని మేడికుంట చెరువు పనులు చేపట్టి సంవత్సరమైనా ఇంకా పూర్తి కాలేదు.  రూ. 15 లక్షలతో చెరువు చుట్టూ కట్ట అభివృద్ధి, అలుగు నిర్మాణం పనులు జరిగాయి. చెరువు కట్ట చుట్టూరా పచ్చదనాన్ని పెంచేందుకు రూ.15 లక్షలతో చేపట్టిన సుందరీకరణ పనులు 75 శాతం పూర్తయ్యాయి.రాయదుర్గంలోని మల్కం చెరువు సుందరీకరణ కోసం రూ.1.60 లక్షలు మంజూరు చేశారు. ఈ చెరువులో రాబోయే గణేశ్ నిమజ్జనం కోసం రూ.67 లక్షలతో కోనేరు నిర్మాణానికి మంత్రి మహేందర్‌రెడ్డి గతనెలలో శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే చందంగా ఉన్నాయి.రూ.2.28 కోట్ల వ్యయంతో నల్లగండ్ల చెరువు బ్యూటిఫికేషన్ పనుల కోసం టెండర్ల ప్రక్రియ మాత్రం  పూర్తి చేశారు. అంతకుమించి ఎలాంటి పనులు జరగలేదు. గోపి చెరువు అభివృద్ధి పనులకు సైతం రూ. 2.39 కోట్లతో టెండర్లు ముగించారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మియాపూర్‌లోని కాయిదమ్మ కుంటలో చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వర్షాకాలంలో ప్రజలకు ముంపు సమస్య లేకుండా చేయడం కోసం పనులు చేపట్టారు. ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement