
'కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాలు జరగలేదు'
హైదరాబాద్ : కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాలు జరగలేదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్ష ఫలితాలపై వివాదం విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
దీనిపై కొంతమంది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కటాఫ్ మార్కులను త్వరలో వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే ఎస్టీ అభ్యర్థికి తక్కువ మార్కులు వచ్చాయని చెబుతున్నారని... అతడు ఎస్టీ కాదన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ మొదటి సారిగా ఛాలెంజ్ ఆప్షన్ని ప్రవేశ పెట్టిందని, అందులో భాగంగా ఈనెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. ఫిర్యాదుదారులకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తామని పేర్కొన్నారు. అప్పటికీ అభ్యర్థులు సంతృప్తి చెందకుంటే కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పారు.