లెక్చరర్లు లేరు!
- జూనియర్ కాలేజీల్లో 3,177 పోస్టులు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంజూరైన 4,552 పోస్టులకుగాను 3,177 ఖాళీగానే ఉన్నాయి. కేవలం 1,375 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పని చేస్తున్నారు. 2007-08 సంవత్సరంలో ప్రారంభించిన మరో 69 జూనియర్ కాలేజీల్లో 743 అధ్యాపక పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ వివరాలను విద్యాశాఖ రూపొందించిన నివేదికలో పేర్కొంది.
డిగ్రీ కాలేజీల్లోనూ అదే తీరు
రాష్ట్రంలో 130 ప్రభుత్వ, 68 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 3,007 మంజూరైన పోస్టులు ఉన్నాయి. ఇందులో 1,760 పోస్టులకు రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తుండగా 1,247 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోపైపు 2007-08 సంవత్సరంలో ప్రారంభించిన 59 కొత్త డిగ్రీ కాలేజీల్లోనూ 134 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించకపోవడం వల్ల డిగ్రీ కాలేజీలు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు పొందలేకపోతున్నాయి. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని న్యాక్ ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులను ఇవ్వాలన్నా ఖాళీలను భర్తీ చేయాల్సిందేన ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
ఇవీ సమస్యలు
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అనేక కాలేజీలు విద్యను అందించలేకపోతున్నాయి. విద్యార్థి కేంద్రంగా అధ్యాపకులు వారి సామర్థ్యాలను మెరుగు పరుచుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో 52 కాలేజీలకు సొంత భవనాలు లేవు. కాలేజీలను మౌలిక సదుపాయల కొరత పీడిస్తోంది. దీంతో యూనివర్సిటీల్లో శాశ్వత అనుబంధ గుర్తింపు పొందలేకపోతున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ మౌలిక సదుపాయాల కొరత, భవనాల సమస్య ఉంది. గత రెండేళ్లలో 14 కొత్త పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం మంజూరు చేసినా వాటిల్లో 320 మంది బోధన సిబ్బందిని మంజూరు చేయలేదు.
ఉన్నత విద్యలో పెరిగిన విద్యా సంస్థలు
ఉన్నత విద్యార ంగంలో విద్యా సంస్థల సంఖ్య పెరుగుతున్నా నాణ్యత ప్రమాణాలు అదే స్థాయిలో పెరగడం లేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ఈ దుస్థితి నెలకొంది. సాంకేతిక విద్యా నిబంధనల ప్రకారం ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు (1:2:6) ఉండాలి. దీని ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 33,706 మంది సిబ్బంది అవసరం ఉంది.
ఇందులో ఎంటెక్ అర్హత కలిగిన 22,470 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11,236 అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కావాలి. కానీ రాష్ట్రంలో ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉంది. 2015-16 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 171 ఇంజీనరింగ్ కాలేజీల్లో 22, 470 మంది సిబ్బంది అవసరమున్నా కేవలం 15,152 మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటంతో పరిశోధనలు లేకుండా పోయాయి. 11 యూనివర్సిటీల్లో 2,400కుపైగా అధ్యాపక పోస్టులు ఉంటే 1,100కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.