సమ్మెలో లేని ఆస్పత్రులకే ఆరోగ్యశ్రీ నిధులు!
* సేవలు నిలిపేసిన ఆస్పత్రులకు బకాయిల విడుదలకు నో
* నెట్‌వర్క్ జాబితా నుంచి తొలగించే దిశగా యోచన
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ సేవలు అందించకుండా సమ్మె చేస్తున్న కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులపై ప్రభుత్వం పరోక్ష చర్యలు చేపట్టింది. వాటికి బకాయిల చెల్లింపును నిలిపివేసింది. పెండింగ్ బకాయిల కోసం తాజాగా రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం... వాటిని కేవలం సమ్మెలో లేని ఆస్పత్రులకే చెల్లించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన ప్రైవేటు ఆస్పత్రులు దిగివస్తున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
మొత్తం 244 నెట్‌వర్క్ ఆస్పత్రులకుగాను ప్రస్తుతం 58 ఆస్పత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. వాస్తవానికి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తున్న ఆస్పత్రులకు బకాయిల విడుదలను నిలిపివేయడంతోపాటు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై వైద్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
సంబంధిత ఆస్పత్రులను నెట్‌వర్క్ జాబితా నుంచి తొలగించే దిశగా కూడా సీరియస్‌గా యోచిస్తున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు దాదాపు అన్ని చోట్లా అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు.