
టెండర్ కాదు... వండర్
బెరైటీస్ తవ్వకంలో రూ.531 కోట్లు హాంఫట్!
ఏపీఎండీసీ ఖజానాకు భారీ గండి
సాక్షి, హైదరాబాద్: ‘రింగ్’ రాజా ‘రింగ్’లా సాగిన బెరైటీస్ తవ్వకం టెండర్‌ను ప్రభుత్వం ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఖజానాకు రూ.531 కోట్లు గండి పడనుంది. ఏటా పెట్రో ఉత్పత్తుల ధరలు పడిపోతున్న నేపథ్యంలో బెరైటీస్ ఖనిజ తవ్వకం వ్యయం తగ్గాలి. ఆ ప్రభావం బెరైటీస్ ఖనిజ తవ్వకం టెండర్లలోనూ కనిపించాలి. వాస్తవ పరిస్థితుల ప్రకారం గతం కంటే తక్కువ మొత్తానికే టెండర్లు దాఖలు కావాలి. అయితే, ఇందుకు పూర్తి భిన్నంగా గతం కంటే అధిక మొత్తానికి వైఎస్సార్ జిల్లా మంగంపేటలో బెరైటీస్ తవ్వకం కాంట్రాక్టును చెన్నైకి చెందిన త్రివేణి ఎర్త్ మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీఎండీసీ కట్టబెట్టింది.
కీలక నేత ఆదేశం మేరకు ‘త్రివేణి’కి టెండర్ కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్న ఏపీఎండీసీ దీనికి అనుకూలంగా టెయిలర్ మేడ్ నిబంధనలు రూపొందించడం, తద్వారా టెక్నికల్ బిడ్డింగులో మూడు సంస్థలే అర్హత పొందిన విషయం విదితమే. ఈ మూడు సంస్థలు రింగై అధిక మొత్తానికి బిడ్లు వేయడంతో ఏపీఎండీసీ ఖనిజానాకు భారీగా గండిపడుతుంది. మళ్లీ టెండర్లు ఆహ్వానించాల్సి ఉండగా.. అధికారులు ఇందుకు భిన్నంగా టెండర్‌ను ఆమోదించిన తీరుపై ‘త్రివేణికి ఏపీఎండీసీ సలాం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే.
‘త్రివేణి’కే దీర్ఘకాలిక టెండర్
2014తో పోల్చితే ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. రోజురోజుకూ పెట్రో ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. యంత్ర పరికరాల రేట్లు కూడా తగ్గాయి. ఖనిజ తవ్వకాలకు వినియోగించేది యంత్రాలే. వీటికి కావాల్సిన ఇంధనం డీజిల్ . యంత్రాలు, డీజిల్ ధరలు తగ్గినందున 2014తో పోల్చితే ఇప్పుడు బెరైటీస్ ఖనిజ తవ్వకం, వ్యర్థాల తొలగింపు వ్యయం తగ్గుతుంది. అందువల్ల గతంలో కంటే తక్కువ వ్యయంతో ఖనిజ తవ్వకం కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు సంస్థలు పోటీ పడా లి. అయితే ఏపీఎండీసీ టెండర్లలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.
గతంతో పోల్చితే మూడేళ్లలో అయితే రూ.318 కోట్లు, అయిదేళ్లకు గణిస్తే రూ.531 కోట్లకు పైగా టెండర్ వ్యయం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014 వరకూ ఈ కాంట్రాక్ట్ వీఎల్‌సీ అండ్ ఎస్సీ జాయింట్ వెంచర్ కంపెనీకి ఉండేది. అప్పట్లో ఈ సంస్థ టన్ను ఖనిజం తవ్వకానికి రూ.98, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.190 మాత్రమే కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. అయినా ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అవరోధాలు కల్పించి తవ్వకాల్లో విఫలమైందనే సాకు చూపించి ఈ సంస్థ కాంట్రాక్టును మధ్యలోనే రద్దు చేయించింది. తదుపరి స్వల్పకాలిక టెండర్లు పిలిచి టన్ను ఖనిజం తవ్వకానికి రూ.113.50, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.260 చెల్లించేలా త్రివేణి సంస్థకు కాంట్రాక్టును కట్టబెట్టింది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థకు దీర్ఘకాలిక టెండర్ కట్టబెట్టడం గమనార్హం.
టన్ను ఖనిజం తవ్వకానికి అప్పుడు రూ.98.. ఇప్పుడు రూ.149
గతంలో కంటే ఎక్కువ మొత్తానికి కాంట్రాక్టును అడ్డగోలుగా త్రివేణికి ఖరారు చేయడం వల్ల ఏపీఎండీసీ వచ్చే అయిదేళ్లలో రూ.531 కోట్లకుపైగా అదనపు భారాన్ని భరించాల్సి వస్తుంది. మూడేళ్లకే చూసినా గతానికి, ప్రస్తుత టెండర్ ధరల మధ్య తేడా రూ.318 కోట్లకు పైగానే ఉంది.
గతంలో వీఎల్‌సీ అండ్ ఎస్సీ సంస్థ టన్ను ఖనిజం తవ్వకానికి రూ.98, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.190 చొప్పున టెండర్ వేసి కాంట్రాక్టు పొందింది. టన్నుకు రూ.98 ప్రకారం 90 లక్షల టన్నుల ఖనిజం తవ్వకానికి రూ.88.20 కోట్లు అవుతుంది. క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.190 ప్రకారం 270 లక్షల క్యూబిక్ మీటర్లకు రూ.534.60 కోట్లు అవుతుంది. రెండింటికీ కలిపి మొత్తం రూ.622.80 కోట్లు మాత్రమే అవుతుంది.
టన్ను ఖనిజం తవ్వకానికి రూ.149, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.299 చొప్పున తాజాగా త్రివేణికి ఏపీఎండీసీ టెండర్ ఖరారు చేసింది. ఈ లెక్కన మూడేళ్లలో 270 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాల తొలగింపునకు రూ.807. 30 కోట్లు అవుతుంది. 90 లక్షల టన్నుల ఖనిజ తవ్వకానికి రూ.134.10 కోట్లు కలిపి మొత్తం రూ.941.40 కోట్లు అవుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కాంట్రాక్టు పనుల కోసం గతంలో కంటే (941.40 మైనస్ 622.80) రూ.318.60 కోట్లు అధికంగా చెల్లించేందుకు ఏపీఎండీసీ అంగీకరించినట్లు తేటతెల్లమవుతోంది.
మూడేళ్ల ఈ కాంట్రాక్టును ఏటా 5 శాతం పెంపుతో మరో రెండేళ్లు పొడిగించే వెసులుబాటు ఏపీఎండీసీకి ఉంది. త్రివేణి సంస్థకు మరో రెండేళ్లు కాంట్రాక్ట్‌ను అప్పగిస్తే 5 శాతం పెంపుదలతో నిమిత్తం లేకుండానే మరో రూ.212.40 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇదే పని కోసం గతంలో వీఎల్‌సీ అండ్ ఎస్సీకి చెల్లించిన మొత్తం కంటే ‘త్రివేణి’కి అయిదేళ్లలో రూ.531 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నది స్పష్టమవుతోంది.
కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును ఏటా 5 శాతం పెంచితే అదనపు భారం మరింత పెరుగనుంది. డీజిల్ ధరలు తగ్గుతుండడంతో తవ్వకం వ్యయం తగ్గాల్సి ఉన్నా అందుకు భిన్నంగా రూ.531 కోట్లు అదనంగా చెల్లించేలా ‘త్రివేణి’కి కాంట్రాక్టు అప్పగించాలని ఏపీఎండీసీ నిర్ణయించడం, దీనిని సర్కారు తప్పుపట్టకపోవడం వెనుక సాగిన తెరచాటు వ్యవహారం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదంతా సంస్థ పుట్టిముంచే వ్యవహారమేనని ఏపీఎండీసీ అధికారులు మండిపడుతున్నారు.
‘రింగ్’ అయ్యారిలా?
ముందే కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం రూ.1,600 కోట్ల బెరైటీస్ తవ్వకం టెండర్‌ను త్రివేణి సంస్థకు అప్పగించేందుకు ఏపీఎండీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. హై ఎండ్ యంత్ర పరికరాలు కలిగి ఉండాలన్న నిబంధన వెనుక అసలు రహస్యం ఇదే. గతేడాది డిసెంబర్ 16వ తేదీ వరకూ బెరైటీస్ తవ్వకం పనులను ‘త్రివేణి’ నిర్వహించింది. మళ్లీ ఆ సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టాలనే ఎత్తుగడతోనే హై ఎండ్ యంత్రాలు (త్రివేణి వినియోగించిన స్థాయివి) కలిగి ఉండాలన్న నిబంధనను ఏపీఎండీసీ పెట్టింది. దీనివల్ల ఈ-టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఒకే సంస్థ టెండర్ వేస్తే దానికి కాంట్రాక్టు ఇవ్వడానికి వీలు కాదు. అందువల్ల కీలక నేత ఆదేశం మేరకు ఒక అధికారి మరో రెండు సంస్థలు నామమాత్రంగా టెండర్లలో పాల్గొనేలా పావులు కదిపి, ‘త్రివేణి’కి సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.