ఇక పాఠ్య పుస్తకాలు చౌక
వచ్చే విద్యా సంవత్సరంలో 30 శాతం తగ్గనున్న ధరలు
♦ టెండర్ల ఖరారుకు ప్రభుత్వ చర్యలు... గతేడాది ఒక్కో పేజీకి 29.50 పైసలు
♦ ఈసారి ఒక్కో పేజీకి 20.50 పైసలకు ఎల్1 టెండర్
♦ అదే రేటుతో చేసేందుకు అంగీకరించిన మిగతా ప్రింటర్లు, పబ్లిషర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కొనుగోలు చేసే పాఠ్య పుస్తకాల ధరలు తగ్గనున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 1.15 కోట్ల పుస్తకాలను తక్కువ ధర కు ముద్రించి, విద్యార్థులకు మార్కెట్‌లో పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు ప్రింటర్లు, పబ్లిషర్లు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. 1.15 కోట్ల పుస్తకాల ముద్రణ, పంపిణీ అంచనాలతో విద్యాశాఖ పిలిచిన టెండర్లలో 12 మంది పెద్ద ప్రింటర్లు, పబ్లిషర్లు టెండర్లు వేశారు. అందులో ఎల్1 సంస్థ పుస్తకాల్లోని ఒక్కో పేజీని 20.50 పైసలకు ముద్రించి, పుస్తకాలను అందించేందుకు టెండర్లు వేసింది.
అయితే 2015-16 విద్యా సంవత్సరంలో సేల్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేందుకు ఒక్కో పేజీకి 29.50 పైసలతో టెండర్లు ఖరారు చేసింది. 2015-16 విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే 2016-17 విద్యా సంవత్సరంలో పుస్తకాలను అందించేందుకు తక్కువ ధరను కోట్ చేశారు. దీంతో సేల్ పుస్తకాల ధరలు 30 శాతం వరకు తగ్గుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎల్1 సంస్థ కోట్ చేసిన రేటుకే (20.50 పైసలకు ఒక పేజీ) మిగతా సంస్థలు పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేందుకు బుధవారం ప్రింటర్లు, పబ్లిషర్లతో నిర్వహించిన సమావేశంలో అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల లెక్కల ప్రకారం టెండర్లు పిలిచారు. ఈసారి పుస్తకాల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంది.
పెరగనున్న పుస్తకాల సంఖ్య!
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకే ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయి. ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు తమకు ఇష్టమైన సిలబస్ కలిగిన పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయి. అయితే 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లోనూ విద్యాశాఖ నిర్ణయించి, రూపొందించిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేటు పాఠ శాలలు దీనిని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మరోవైపు ఎల్‌కేజీ, యూకేజీకి కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సిలబస్‌ను రూపొందించి పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో ఈసారి సేల్ పుస్తకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.