
పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
రూ.42.7 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: రద్దయిన పాత నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న నలుగురు ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.42.7 లక్షల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాకు నర్సాపురానికి చెందిన కె.శ్రీనివాస్(32) మోతీనగర్‌లో నివశిస్తున్నాడు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు.. ఆర్‌బీఐ వద్ద చిరిగిన నోట్లు మార్పిడి చేసే సనత్‌నగర్‌వాసి జి.ప్రశాంత్(55)తో పరిచయం ఏర్పడిం ది. రద్దయిన నోట్లను మార్చేందుకుగానూ రూ.24 లక్షల విలువైన పాత రూ.1000, రూ.500 నోట్లను ప్రశాంత్ శ్రీనివాస్‌కు ఇచ్చాడు.
శ్రీనివాస్ పలు దఫాలుగా రూ.10 లక్షలను ప్రశాంత్‌కు అందించాడు. ఎర్రగడ్డకు చెందిన గార్మెంట్ సేల్స్, కమిషన్ ఏజెంట్ మహ్మద్ నసిరుద్దీన్(35) శ్రీనివాస్‌కు రూ.11.2 లక్షలు ఇవ్వగా, దీనికి కమిషన్‌గా రూ.4.2 లక్షలు అందించాడు. ఇలా రూ.35.2 లక్షల విలువ చేసే రద్దయిన నోట్లను సేకరించి శ్రీనివాస్ దగ్గర పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 20 రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి వచ్చి కేపీహెచ్‌బీలో ఉంటున్న ఏసీ మెకానిక్ నరసింహతో అతడికి పరిచయం అయింది. ఇద్దరూ కలసి పాత నోట్లను మార్చే క్రమంలో బేగంపేట్‌లో ఏజెంట్ల కోసం ప్రయత్నిస్తుండగా... పోలీసులు వారితో పాటు మరో ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు.