పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై ఉద్యమించాలని అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఆర్‌సీని తెచ్చుకున్న మనకు పాత పెన్షన్ విధానాన్ని తెచ్చుకోవటం అసాధ్యమేమీ కాదని అన్నారు.
టీఎన్‌జీఓ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్ మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తికి జీవితకాలం పెన్షన్ ఇస్తున్నప్పుడు 30 ఏళ్లుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తికి పెన్షన్ ఇవ్వకపోవటం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, టీఎన్‌జీఓ అధ్యక్షులు కారం రవీందర్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.