వారే బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో!
హైదరాబాద్: అందరిలో ఉల్లాసం.. ప్రకృతిలో సీతాకోకచిలుకల్లా కేరింతలు.. రాళ్లు రప్పలూ.. చెట్టూ పుట్టా అన్నింటిని ముద్దాడే ఆశ.. తనివి తీరా స్పర్షించాలన్న కోరిక.. ప్రతి కొత్త చోటును కెమెరాతో తమ వద్దకు చేర్చుకునే ప్రయత్నం.. తొలుత నిర్మలంగా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్న ఆ నది పారే మార్గంలో స్నేహితులంతా కలిసి కోలాహలంగా గంతులు వేస్తూ కెమెరాలతో వీలయినన్ని ఫొటోలతో బిజీగా ఉండగా..మొదట చినుకై ఆ తర్వాత వరదై మరికాసేపట్లో ఉప్పెనైనట్లుగా ఒక్కసారిగా గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. ముందు సెలయేరుగా మారి వారి పాదాలను ముద్దాడింది.. ఆ వెంటనే వేగం పెంచి మరో రూపాన్ని సంతరించుకుంది. దీంతో భయపడినవారంతా పారిపోయేందుకు ప్రయత్నించినా అందరినీ అమాంతం హత్తుకుని తనలో కలిపేసుకుంది. వారి కుటుంబాల్లో విషాధం నింపింది. ఘటన తీరు చూసిన అందరి కళ్లలో వరదల్లే నీరు నింపింది.
ఇది సరిగ్గా ఏడాది కిందట హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా టూర్కు వెళ్లిన విద్యార్థుల విషణ్ణ వదనాల చరిత. హిమాచల్ప్రదేశ్లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించగా కొందరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే పండో డ్యామ్ తలుపులు తెరవడంతో ఆ వరద నీటికి వారంతా కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కాస్త అప్రమత్తంగా ఉన్నా.. అనుభవజ్ఞులు పక్కన ఉన్న వారు బతికి బయటపడేవారేమో. నది ప్రవహించే మార్గంలోని రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారే తప్ప వారి ప్రాణాలు పోతాయన్న విషయం గమనించలేదు. కాళ్ల కిందకు నీళ్లు వస్తుండగా ఒడ్డున ఉన్న స్థానికులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేసి బయటకు రమ్మంటూ చేతులు ఊపినా.. వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకొని వీరు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు.
క్షణాల్లో వీరంతా రాళ్ల నుంచి నీళ్లలో పడి కొట్టుకుపోయారు. కనీసం నెల రోజులపాటు వీరి మృతదేహాల కోసం గాలింపులు జరిగాయి. ఈ ఘటనలో కళాశాల, అక్కడి డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి 24 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇకముందైనా కళాశాలలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోగలిగితే అటు తల్లిదండ్రులకు, వారి పిల్లలకు బంగారు భవితకు భరోసా ఇచ్చినట్లవుతుంది. ఏదేమైనా.. ఉజ్వల భవిష్యత్ ఉండి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఆ 24 మంది విద్యార్థులు బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో.