చిట్టచివరి నిమిషం వరకు ఆనందంగా..
ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు వరకు అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగానే ఉన్నారు. వెనక నుంచి నీటి రూపంలో వెంటాడుతూ వస్తున్న మృత్యువును ఎవరూ గుర్తించలేకపోయారు. హిమాచల్ప్రదేశ్లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా వెళ్లిన విద్యార్థులు విషణ్ణ వదనాలతో రావాల్సి వచ్చింది.
తొలుత పండో డ్యామ్కు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు.. రాళ్ల మధ్య నుంచి వంపులు తిరుగుతూ వెళ్తున్న నీళ్లను చూసి పరవశించిపోయారు. అడుగు లోతు కూడా లేకపోవడంతో సరదాగా లోపలకు దిగారు. వెళ్లే ముందు కూడా ఎందుకైనా మంచిదని అక్కడున్న స్థానికులను ఓసారి అడిగారు. అదంత ప్రమాదకరమైన ప్రదేశం కాదని, అయితే కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండాలని వాళ్లు చెప్పడంతో అందరూ ఉత్సాహంగా లోపలకు వెళ్లారు. చాలాసేపు ఫొటోలు తీసుకున్నారు. వీడియోలు కూడా తీశారు. ఒకరిద్దరైతే వెంటనే వాట్స్ యాప్ లాంటివాటి ద్వారా షేర్ చేశారు.
రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించారు. సరదాగా జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు. క్షణాల్లోనే కాళ్ల కిందకు నీళ్లు వచ్చేశాయి. ఒడ్డున ఉన్న స్థానికులు వీళ్లను అప్రమత్తం చేసేందుకు బయటకు రమ్మంటూ చేతులు ఊపారు. కానీ, వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకోవడంతో వీళ్లు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. పిల్లలు నిలబడిన చిన్నపాటి రాళ్లు కొట్టుకుపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయారు. చాలామంది నీళ్లలో కొట్టుకుపోగా.. దాదాపు సగం మంది మాత్రం మిగిలినవారి సాయంతో బయటపడ్డారు.