పాపం.. ఆ అవ్వ చనిపోయింది
ఉసురుతీసిన ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యం
అఫ్జల్‌గంజ్: పాపం... ఆ అవ్వ చనిపోయింది. ఏ దిక్కూలేని ఆమెకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమయానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో చివరికి కన్ను మూసింది. వైద్యో నారాయణో హరి అంటారు. అయితే, ఇక్కడి వైద్యులు ఆ మాటకు అర్థాన్ని మార్చేశారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అపస్మారకస్థితిలో ఉన్న వృద్ధురాలిని పోలీసులు వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు, సిబ్బంది ఆమె వెంట సహాయకులు లేరనే కారణంతో ఈ నెల 13వ తేదీ అర్దరాత్రి ఆసుపత్రి నుంచి గెంటివేశారు. మరుసటి రోజు ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డికి ఈ విషయం తెలిసి వైద్యులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రిలో చేర్చుకొని రెండు రోజుల పాటు వైద్యం అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రి నుంచి బయటికి గెంటివేయకుండా వైద్యం అందించి ఉంటే ఆమె మరికొన్ని రోజులు ఈ లోకంలో ఉండేదేమో.. సరైన వైద్యం అందకపోవడంతో గురువారం రాత్రి కన్నుమూసింది. ఎవ్వరూ లేని అనాధగా మిగిలిపోవడం ఆ అవ్వ చేసిన పాపమా.. లేక సరైన సమయంలో వైద్యం అందించని ఉస్మానియా వైద్యులదా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్చురీలో మృతదేహం: వృద్ధురాలి సంబంధీకులు ఎవ్వరూ లేకపోవ డంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు అనాధ శవంగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులుంటే అఫ్జల్‌గంజ్ ఠాణాలో సంప్రదించాలని కోరారు.