'ఉస్మానియా' భవనం తొలగింపు!
- ఆసుపత్రి భవనాన్ని వారసత్వ హోదా నుంచి తొలగించే ప్రయత్నాలు షురూ
- హెరిటేజ్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన సర్కారు
- ఆ స్థానంలో 20 అంతస్తులు గల రెండు టవర్లతో భారీ ఆసుపత్రి
- నూతన భవనం రూపురేఖలపై ఆర్కిటెక్ట్‌లతో వైద్య మంత్రి భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దాన్ని వారసత్వ హోదా (హెరిటేజ్) నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. సంబంధిత ప్రతిపాదనను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని వారసత్వ హోదా కమిటీకి పంపారు. ఆ కమిటీ సమావేశమై తొలగింపునకు ఆమోదం తెలపగానే ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ఇక సాధారణ భవనంగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ భవనాన్ని తొలగించి ఆ స్థానంలో 20 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తారు.
అయితే పాత భవనానికి గుర్తుగా నమూనా భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం రాష్ట్రంలోని ప్రముఖ ఆర్టిటెక్ట్‌లతో సమావేశం నిర్వహించారు. భవనం లేఔట్ ఎలా ఉండాలో చర్చించారు. నూతన భవన ఊహా చిత్రాలు రూపొందించి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పాత భవనం కంటే అత్యంత వైభవంగా... అత్యాధునికంగా ఉండేలా చేయాలని సూచించారు. వీలైనంత త్వరలో కొత్త భవనాలను నిర్మించాలని సర్కారు భావిస్తోంది. అయితే ఎంతైనా అధిక సమయం తీసుకునే అవకాశం ఉన్నందున పాత భవనాన్ని తొలగించాక వైద్య సేవల కోసం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంచేయాలన్న అంశంపైనా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
వందేళ్లకు పైగా ఘన చరిత్ర
1910లో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వైద్య సేవల కోసమే నిర్మించారు. రెండంతస్తులున్న (జి+2) ఈ భవ నాన్ని పురావస్తుశాఖ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రస్తుతం అందులో 1,500 పడకలున్నాయి. నిత్యం 2 వేల మందికిపైగా రోగులు చికిత్స కోసం వస్తుంటారు. నిజాం కాలంలో నిర్మించిన ప్రతీ భవనం కూడా ఇలాంటి ప్రత్యేకతలనే సంతరించుకున్నాయి. చూడ టానికి ఎంతో అపురూపంగా ఉంటుందీ ఈ భవనం. అయితే ప్రస్తుతం దాని పరిస్థితి శిథిలావస్థలో ఉంది.
ఐదారేళ్ల కంటే కూడా ఆ భవనం ఉండదని జేఎన్‌టీయూ నిపుణులు కూడా ప్రభుత్వానికి విన్నవించారు. దాన్ని ఆధునీకరించడానికి కూడా సాధ్యపడటం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళనలు కూడా అందరినీ వేధిస్తున్నాయి. పైగా అత్యాధునిక వైద్య సేవలు కల్పించడం కష్టంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా ఉంటోంది. అయితే దాన్ని తొలగించాలన్న నిర్ణయంతో వారసత్వ సంపద పరిరక్షకుల నుంచి అనేక విమర్శలూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దాన్ని కేవలం ఆసుపత్రి కోసమే నిర్మించినందున కూల్చి వేయడం తప్పుకాదని... పైగా దాని స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో మరో భవనం నిర్మిస్తామని సర్కారు చెబుతోంది. పైగా వారసత్వ కట్టడాల స్థానంలో కొత్త వాటిని నిర్మించి ప్రజలకు సేవ చేస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఒకవేళ దాన్ని అలాగే ఉంచి పక్కన మరో భవనం నిర్మించాలన్నా పాత భవనానికి మించి అంతస్తులు కట్టడానికి కూడా వీలుండదంటున్నారు. కాబట్టి దీన్ని తొలగించడమే సరైన నిర్ణయంగా సర్కారు భావిస్తోంది. దీనిపై వారసత్వ హోదా కమిటీ ప్రభుత్వం చెప్పే వాదనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. ఇదంతా లాంఛనప్రాయమే కానుంది.