కుప్పకూలిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఓపీ భవనం ప్రవేశద్వారం పైకప్పు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఓపీ భవనం ప్రవేశద్వారం పైకప్పు మళ్లీ కుప్పకూలింది. వందల మంది చికిత్స పొందుతున్న ఈ భవనంలో సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి పైకప్పు పెచ్చులూడి కింద పడటంతో భారీ శబ్దం వచ్చింది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అసలే వర్షాకాలం..ఆపై రోజుకో చోట పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు ఆందోళేన చెందుతున్నారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులకు ఇది సురక్షితం కాదని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు.
దీంతో అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి.. 2009లో రూ.5 కోట్లు మం జూరు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనం స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలుసహా పురావస్తు శాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఆ భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment