త్వరలో గడువు పెంచుతాం: కమిషనర్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన కామన్ షెడ్యూలు, ఆన్‌లైన్ దరఖాస్తుల విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఇప్పటిదాకా లక్ష మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తరువాత దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరగవచ్చన్నారు. కాబట్టి దరఖాస్తుల గడువు పెంచనున్నట్టు వెల్లడించారు. వారిలో చాలామంది డిగ్రీలో చేరతారు గనుక వారికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు.
ఇప్పటికే కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చినవారు వాటిని మార్చుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్ ప్రక్రియతో ప్రవేశాల విధానంలో ప్రక్షాళన జరిగిందని చెప్పారు. ‘‘రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 96,593 మంది తెలంగాణ, 1,641 మంది ఏపీ, 1,776 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు. తమ పేర్లతో వేరేవారు దరఖాస్తు చేశారంటూ రద్దు కోసం 201 మంది విద్యార్థులు చేసిన అభ్యర్థనపై విచారణ చేయిస్తాం’’ అన్నారు. న్యాక్ అక్రెడిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బాలికల డిగ్రీ కాలే జీల్లో హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఈసారి సీట్ల సంఖ్య 30 వేలు పెరిగిందన్నారు. గతేడాది 1,085 కాలేజీల్లో 3,61,172 సీట్లుండగా ఈసారి 1,103 కాలేజీల్లో 3,94,575 సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.
లక్ష దాటిన డిగ్రీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
Published Tue, Jun 7 2016 4:44 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement