
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికుడి సొంతింటి కల సాకారం కానుంది. ఇంటి కోసం తీసుకునే రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపునకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, సర్క్యులర్ కూడా జారీ చేస్తున్నట్లు తెలిపారు. గృహ రుణాలపై వడ్డీకి సంబంధించి రూ.130 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో ఉద్యోగం వద్దనుకున్నవారికి ఒకేసారి రూ.25 లక్షలు లేదా నెలకు రూ.25 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సుమారు వందమందికి పైగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. సింగరేణి ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తామని, దీనిపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ జయంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు సెలవు ప్రకటిస్తున్నామని, అన్ని క్యాంటీన్లను ఆధునీకరించి నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తామని, ఐఐటీ, ఐఐఎంలలో ఉన్నతవిద్య చదివే కార్మికుల పిల్లలకు ఫీజులు చెల్లిస్తామని తెలిపారు. కొత్తగా ఆరు భూగర్భ గనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment