‘ఆరోగ్యశ్రీ యాప్’తో అరచేతిలో వైద్యం
♦ వైద్యుడి అపాయింట్‌మెంట్ మొదలు రోగిని అప్రమత్తం చేసే వీలు.. జీపీఎస్ ద్వారా సమీపంలోని ఆసుపత్రుల సమచారం
♦ సిద్ధం చేసిన వైద్యారోగ్య శాఖ... 7న ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. ‘ఆరోగ్యశ్రీ యాప్’ను సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని ఆసుపత్రులు చికిత్సలు అందిస్తున్నాయో సమగ్ర సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేశారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు అరచేతిలోనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందేలా తయారు చేశారు. లక్షల మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వివరాలు, వారికి ఇప్పటివరకు జరిగిన చికిత్సలు, వారికున్న ఆరోగ్య సమస్యలన్నీ అందులో ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యశ్రీ కార్డుపై ఉన్న నంబర్‌ను క్లిక్ చేస్తే చాలు పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. అలాగే శస్త్రచికిత్స చేసుకోవడానికి వెళ్లేముందు సంబంధిత నెట్‌వర్క్ ఆసుపత్రిలో ఉండే డాక్టర్ అపాయింట్‌మెంటును కూడా యాప్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతాయి.
జీపీఎస్ ద్వారా ఆసుపత్రికి దారి...
తెలంగాణ రాష్ట్రంలో 77.19 లక్షల మంది సాధారణ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల కార్డులున్నాయి. అలాగే 5.47 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులున్నాయి. వీరితోపాటు త్వరలో 23 వేల మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు ఇవ్వనున్నారు. సుమారు 83 లక్షల మందికి ఈ యాప్ ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఇందులో జీపీఎస్ ద్వారా ఆసుపత్రికి నేరుగా తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు ఎక్కడైనా ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడికి రోడ్డు ప్రమాదం జరిగితే యాప్ ద్వారా సమీపంలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల వివరాలు ప్రత్యక్షమవుతాయి. రోడ్డు ప్రమాదం కాబట్టి సంబంధిత వైద్య వసతి ఉన్న నెట్‌వర్క్ ఆసుపత్రులకు నేరుగా తీసుకెళ్లేలా జీపీఎస్ రోడ్డు మ్యాప్ చూపిస్తుంది. ఆ ప్రకారం 108 అంబులెన్స్ ద్వారా తక్షణమే ఆ ఆసుపత్రికి తీసుకెళ్లవచ్చు.
రోగికి వైద్యుడి ఫాలోఅప్
రోగి శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికెళ్లాక అతన్ని వైద్యులు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసే సదుపాయం కల్పించారు. ఉదాహరణకు వారం పది రోజుల్లో మందులు అయిపోతుంటే 104 నంబర్ నుంచి మొబైల్ యాప్ ద్వారా రోగి ఫోన్‌కు కాల్ చేసి అప్రమత్తం చేస్తారు. సమీపంలో ఎక్కడ మందులు దొరుకుతాయో.. చెకప్‌కు ఎప్పుడు రావాలో చెబుతారు. అప్పుడే అపాయింట్‌మెంట్ ఇస్తారు. ఏదైనా సమస్య ఉంటే యాప్ ద్వారా వైద్యుడికి చెప్పేలా వెసులుబాటు కల్పించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఫోన్ నంబర్లతోపాటు వైద్యుల ఫోన్ నంబర్లన్నీ యాప్‌లో ఉంటాయని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ యాప్‌ను ఈ నెల ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ప్రథమంగా రాష్ట్రంలో ఇటువంటి యాప్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు.