ఆస్తి కోసం తల్లితండ్రులను గెంటేశారు
ఆస్తి కోసం తల్లితండ్రులను గెంటేశారు
Published Sun, Aug 6 2017 7:48 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM
♦ ఐదంతస్తుల భవనంపై కుమారుల కళ్లు
♦ అనాథాశ్రమానికి వెళ్లాలంటూ వేధింపులు
♦ వృద్ధ తల్లిదండ్రులకు నరకయాతన
బంజారాహిల్స్: పైసా..పైసా కూడబెట్టి తినీ.. తినక ఐదంతస్తుల భవనం కట్టించారు..తన కొడుకులతో సుఖంగా ఉండొచ్చని అనుకున్నారు.. అయితే ఆ కుమారులు తల్లిదండ్రులు అని కూడా చూడకుండా మొత్తం మాకే కావాలంటూ రోడ్డున పడేశారు. అనాథాశ్రమానికి పొండి అని కొడుతున్నారని ఆ తల్లితండ్రులు వాపోతున్నారు.
మెదక్ జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన గాందారి బాలాచారి(72), మణెమ్మ(68) దంపతులు పొట్ట కూటి కోసం నగరానికి వచ్చి కార్మికనగర్‌లో ఇల్లు కట్టుకున్నారు. 2016 వరకు ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్నారు. ముగ్గురు కొడుకులుండగా 2012లో పెద్ద కొడుకు మృతి చెందాడు. ఇటీవల ముగ్గురు కొడుకులకు సమానంగా ఇంటిని పంచివ్వాలని ప్రయత్నించగా ఇద్దరు కొడుకులు అందుకు నిరాకరిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశారు. మూడు భాగాలు చేసి ముగ్గురికి పంచివ్వాలంటుంటే.. మీరే అక్కర్లేదంటూ వృద్ధులని కూడా చూడకుండా రోడ్డున పడేశారని ఎనిమిది నెలలుగా బయటే ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులు అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికి రెండుసార్లు బంజారాహిల్స్ ఏసీపీని కలవడానికి వచ్చామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఏసీపీ నోముల మురళికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇదే విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. తమను సొంతిట్లో కాకుండా అనాథ ఆశ్రమానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు కొట్టడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు.
రూ. కోటిన్నర విలువ చేసే ఇంట్లో ప్రస్తుతం 40 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని ఈ ఇల్లు కట్టిచ్చింది తామే అయినా ఇప్పుడు కొడుకుల దౌర్జన్యానికి నిలువ నీడ లేకుండా రోడ్డున పడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను అనాథ ఆశ్రమానికి వెళ్లాలంటూ కొడుతున్న కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకో వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారా హిల్స్ ఏసీపీ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించారు.
Advertisement
Advertisement