ఔటర్‌పై ‘టోల్’ మోత
పెద్దఅంబర్‌పేట్-ఘట్‌కేసర్ మార్గంలో టోల్‌ప్లాజాలు
రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం
సిటీబ్యూరో: పెద్దఅంబర్‌పేట- ఘట్‌కేసర్ మార్గంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు టోల్ మోత మోగనుంది. ఈనెల 4వ తేదీ నుంచి టోల్ ట్యాక్స్ వసూళ్లను ప్రారంభిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. గురువారం అర్థరాత్రి 1గంట నుంచి పెద్దఅంబర్‌పేట- ఘట్‌కేసర్ మార్గంలో టోల్ ట్యాక్స్ వసూలును అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం ఔటర్‌పై టోల్ వసూలు చేస్తున్న ‘ఈగల్’ సంస్థకే ఈ బాధ్యతను అప్పగించారు. మొత్తం ఔటర్‌పై 2016 జనవరి వరకు టోల్ వసూలు చేసేందుకు ‘ఈగల్’ సంస్థతో హెచ్‌ఎండీఏ ఇప్పటికే ఒప్పందం చేసుకొంది. గడువు ముగిసేవరకు ఈ మార్గంలో టోల్ వసూలు చేసుకొనేందుకు బుధవారం తాజాగా అధికారికంగా అనుమతిచ్చింది. ఇందుకుగాను సదరు సంస్థ నెలకు రూ.23 లక్షలు హెచ్‌ఎండీఏకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో టోల్‌గేట్ వసూలుకు ఘట్‌కేసర్, తారామతిపేట్, పెద్దఅంబర్‌పే జంక్షన్ల వద్ద కొత్తగా టోల్ ప్లాజాలు ఏర్పాటు చే స్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి ఈ ఇంటర్ ఛేంజెస్ వద్ద టోల్ వసూలు మొదలవుతుంది. అయితే... ప్రధాన రహదారికి ఆనుకొని ఉండే సర్వీసు రోడ్లపై ఎటువంటి పన్ను వసూలు చేయరు. కేవలం మెయిన్ క్యారేజ్ వేపై ప్రయాణానికేఈ పన్నులు వర్తిస్తాయని హెచ్‌ఎండీఏ ప్రకటించింది.
రూ.10 నుంచి ఛార్జీ : ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ వసూలు చేస్తున్న ఛార్జీలను ప్రమాణికంగా తీసుకుని టోల్ ఛార్జీ నిర్ణయించినట్లు ఓఆర్‌ఆర్ అధికారులు తెలిపారు. ప్రతి కి.మీ.కు కారుకు సుమారు 84పైసలు, లైట్ రవాణా వాహనానికి రూ.1.37పై, మీడియం వెహికల్ (బస్సు, లారీ)కి రూ. 2.87పై, భారీ వాహనాలకు రూ.3.13పై, మెషినరీ వెహికల్(6 చక్రాలు)కు రూ.4.49పై, 7యాక్సిల్ పైన ఉన్న భారీ వాహనాలకు ఒక కి.మీ.రూ.5.48పై ఛార్జీ వసూలు చేస్తారు. అయితే... పన్ను చెల్లింపులో చిల్లర సమస్య రాకుండా కనీస ఛార్జీ రూ.10లుగా నిర్ణయించారు.
టెండర్ పిలుస్తాం..
ప్రస్తుతం టోల్ టెండర్ దక్కించుకొన్న ఈగల్ సంస్థతో 2016 జనవరి వరకు ఒప్పందం ఉందని, ఆతర్వాత మళ్లీ టెండర్ పిలిచి అత్యధికంగా కోట్ చేసిన సంస్థకు మొత్తం ఔటర్‌పై టోల్ వసూలు బాధ్యతను అప్పగిస్తామని సీజీఎం ఆనంద్ మోహన్ తెలిపారు. ఇటీవలి వరకు ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలో ఉచిత ప్రయాణానికి అనుమతిచ్చామని, అయితే... రోడ్డు నిర్వహణ, ఆధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉన్నందున టోల్ వసూలు అనివార్యమైందన్నారు. టీఎంఎస్ అందుబాటులోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంటంతో అప్పటివరకు మ్యాన్యువల్‌గా టోల్ వసూలు చేస్తామని ఆయన వివరించారు.